ప్రభుత్వం పరిపాలన సాగించాలంటే.. ఎన్నో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్నో కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఆ లావాదేవీలు కోట్లలోనే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే అవినీతి చోటుచేసుకుంటుంది. ఆ కొనుగోళ్ల కాంట్రాక్టులు నేతలు, అధికారులకు చెందిన వారికే దక్కుతుంటాయి. ఆ రకంగా అక్రమార్జనకు బాటలు పడతాయి. సర్కారు సొమ్ము..అంటే ప్రజల సొమ్ము క్రమంగా వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతుంది.


ఇప్పుడు ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. కోటి రూపాయలకు మించిన ఓ వస్తువు కొనాలన్నా ఆ వివరాలు వెబ్ సైట్ లో పెట్టాలి. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతపై చర్చించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. జగన్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని విధానాలపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు.


సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

‘కోటి రూపాయలు దాటి ఏం కొనుగోలు చేసినా.. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామో కూడా పొందుపర్చాలి. అదే సమయంలో అంతకంటే తక్కువకు కోట్‌ చేయదలుచుకునేవారికి ఆ కాంట్రాక్టు ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వ విధానం దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ స్కామ్‌లకు అవకాశం ఉండకూడదు. వ్యవస్థను శుద్ది చేయడం చాలా ముఖ్యం. మనకు తెలియకుండానే చాలా జరిగిపోయే పరిస్థితులు ఉన్నందునా.. వాటికి కచ్చితంగా అడ్డుకట్ట వేయాలి.


అధికారులు ఆలోచన చేసి ఒక పరిష్కారాన్ని చూపాలి. ఏదైనా కొనుగోలు జరపాలన్నప్పుడు.. టెండర్లను ఆహ్వానించాలి. టెండర్‌ పలానా వారికి ఇస్తున్నామని ఖరారైన తర్వాత... ఆ రేటును వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. తర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు కొంత సమయం ఇవ్వాలి. అలాగే కొనుగోళ్లలో అమలు చేస్తున్న ఉత్తమ పారదర్శక విధానాలపై అధికారులు అధ్యయనం చేయాల’ని అన్నారు. త్వరలో మరోసారి ఈ విధానంపై చర్చ జరిపి క్రమంగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: