ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. 2020 ఉగాది పండుగ రోజుకు రాష్ట్రంలోని అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఎంతమందికి ఇళ్ళు లేవో, ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో అర్హుల జాబితాను తయారు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల్ని ఆదేశించారు. 
 
ఇంటి స్థలం పట్టాలు అందించటానికి ప్రభుత్వం దగ్గర ఎంత భూమి అందుబాటులో ఉందో, ఎంత భూమి అవసరం అవుతుందో అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. భూ సర్వేకు ఆధునిక పరికరాలు వాడాలని భూయజమానులకు శాశ్వత భూ హక్కుల కోసం సమగ్రంగా భూముల యొక్క సర్వే చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అధికారులు నెల రోజుల ముందే ఇంటి స్థలం పట్టాలను సిధ్ధం చేస్తామని తెలిపారు. 
 
ప్రస్తుతం పట్టణాల్లో 2,580 ఎకరాలు, గ్రామాల్లో 20,800 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఈ భూమిలో ఇంటి స్థలాల కోసం అనువైన భూమి ఎంత ఉందనే విషయాన్ని నిర్ధారించే కార్యక్రమాన్ని చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామాల్లో 14 లక్షల మంది , పట్టణాల్లో 12 లక్షల మందికి ఇంటి స్థలాలు అవసరమని అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డిగారికి వివరించారు. 
 
రాష్ట్రంలోని భూముల సర్వే కోసం కంటిన్యూస్ ఆపరేషన్ రిఫరెన్స్ స్టేషన్ అనే టెక్నాలజీ వినియోగించబోతున్నామని, దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ టెక్నాలజీ వినియోగించబోతుందని అధికారులు సీఎంకు వివరించారు. మూడు విడతలలో రెండున్నర సంవత్సరాలలో ఈ సర్వే పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: