రాష్ట్రం కృషాగోదావరి పరవళ్లతో పరవశించిపోతోంది. చాలా ఏళ్ల తర్వాత కృష్ణానదికి జలప్రవాహం ఉరకలెత్తుతోంది. కొద్దిరోజుల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ రెండూ నిండిపోయి..నీరు కిందకు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణా జలాల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూసే రోజులు పోయి.. టీఎంసీల కొద్దీ తరలివచ్చిన నీటిని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది.


అందుకే.. ఈ అవకాశాన్ని ఏమాత్రం వదలొద్దని జగన్ అధికారులకు సూచిస్తున్నారు. ధ్యాసపెట్టి అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు.


‘దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం వల్ల జలాలు వస్తున్నాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. మనకు కేవలం నెలరోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపుకోగలగాలి. కృష్ణా పరీవాహక ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. కొన్ని చోట్ల కాల్వలకు గండ్లు పడుతున్నాయి. గోదావరిలో వరదలు తగ్గుతున్నాయి.


ఆ ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కంటెంజెన్సీ ప్లాన్‌ చేయండి అని కలెక్టర్లకు సూచించారు. ‘ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను సేకరించండి. వాటి పంపిణీలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి. కరువుకు సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం తగిన సహాయం చేస్తుంది అంటూ జగన్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. జగన్ సూచనను అధికారులు పాటిస్తే ఏడాది వరకూ రాష్ట్రంలో నీటి కొరత అన్నమాట వినిపించకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: