ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సామాన్య విషయం కాదు.. ఆయన ఒక్క సంతకం పెడితే.. వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ముందుకు కదులుతాయి.. ఆయన ఒక్క మాట చెబితే.. వందల కోట్ల బిల్లులు ఆగిపోతాయి. ఆయన తీసుకునే ఒక్క నిర్ణయం కొంత మంది కార్పొరేట్ల గుండెల్లో బాంబలు పేలుస్తుంది. మరి అలాంటి సీట్లో కూర్చున్న వాళ్లను ఏదో ఒక రకంగా ప్రసన్నం చేసుకుందామని కాంట్రాక్టర్లు, కార్పోరేట్లు ప్రయత్నించక మానరు.


ఇలా ప్రయత్నించే వాళ్లలో ఒక్కొక్కళ్లదీ ఒక్కో స్టయిల్.. బతిమాలి బుజ్జగించేవారు కొందరైతే.. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసిన కేంద్రమంత్రులతో రాయబారాలు చేసేవారు మరికొందరు. ఇప్పుడు ఏపీలో జగన్ అవినీతిపై పోరాటం అంటూ గట్టిగా మాట్లాడుతుండటంతో ఆయనపై ఈ కాంట్రాక్టర్లు, కార్పొరేట్ల లాబీ అనేక రకాలుగా వత్తిళ్లు తెస్తోందట. ఈ విషయాన్ని జగనే స్వయంగా వెల్లడించారు.


అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా ఉండడంతో తనపై కూడా ఒత్తిళ్లు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పారు. అయినా ఎవరి ఒత్తిడి తలొగ్గడం లేదని, అవినీతిపై పోరాడాల్సిందేనని ఆయన అన్నారు. మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ సమయంలో ఈ కామెంట్స్ చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయాల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని జగన్ అంటున్నారు.

ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అని ముఖ్యమంత్రి తన సహచరులను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం విషయాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుండా అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కదా? అని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని జగన్ అన్నారు. మరి జగన్ చిత్తశుద్ధిని అనుమానించలేం.. జగన్ ఇదేవిధంగా గట్టి పట్టుదలగా ఉంటే.. కాంట్రాక్టర్లు, కార్పోరేట్ల లాబీ దారికి రావడం ఖాయం.. దాని ద్వారా ప్రజాధనం మిగలడమూ ఖాయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: