తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి అదిరిపోయే షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే తెలంగాణలో ఆ పార్టీకి కేవ‌లం అశ్వారావుపేట ఎమ్మెల్యే ఒక్క‌రు మాత్ర‌మే ఉన్నారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో పార్టీ నుంచి గెలిచిన స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య కూడా పార్టీ మారిపోయారు. ఇప్ప‌టికే అగ్ర‌శ్రేణి నేత‌లు అంద‌రూ ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. ఇక ఎల్‌.ర‌మ‌ణ‌, రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి లాంటి ఒక‌రిద్ద‌రు చెప్పుకోద‌గ్గ నేత‌లు మాత్ర‌మే పార్టీలో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి మిగిలిన కొస‌రు కేడ‌ర్‌పై క‌న్నేసి వారిని త‌మ పార్టీలోకి లాగేసుకుంటోంది.


దీంతో జిల్లాల‌కు జిల్లాల్లో అక్క‌డ టీడీపీ కేడ‌ర్ ఖాళీ అయిపోతోంది. బుధ‌వారం ఏకంగా మూడు జిల్లాల‌కు చెందిన కీల‌క నేత‌లు పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. న‌ల్గొండ జిల్లాలో టీడీపీ తరుపున బలంగా వాయిస్ వినిపించే ఆ పార్టీ రాష్ట్ర నేత పాల్వాయి రజనీకుమారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 18న బీజేపీ చేరబోతున్నామని రాజీనామా సందర్భంగా రజనీకుమారి చెప్పుకొచ్చారు. 


ఇక భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో 30 సంవత్సరాలుగా ఉంటున్న ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు కోనేరు సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల అమిత్ షాతో భేటీ అయిన ఆయన బీజేపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 18న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. 


పార్టీకి రాజీనామా చేసిన రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌లో టీడీపీకి సరైన నాయకత్వం లేదని, ఎన్నికలు పూర్తై 10 నెలలు గడుస్తున్నా.. కనీసం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించి సమీక్షించే పరిస్థితి లేకపోవటం దారుణమన్నారు. ఏదేమైనా టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు పార్టీ జంప్ చేసేయ‌డంతో తెలంగాణ‌లో తెలుగుదేశం పేరు ప‌లికే నాథుడు కూడా ఉండే ప‌రిస్థితి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: