73వ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్ర‌కోట‌లో జెండా వంద‌నం చేశారు.  ముందుగా రాజ్‌ఘాట్‌లో మహత్మాగాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని తివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. వరద మృతులకు మోదీ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని త‌న‌ అనేక ప్ర‌శ్న‌లు, ఎన్నో ఆశ‌లు క‌ల్పించేలా త‌న ప్ర‌సంగం కొన‌సాగించారు.


ప్ర‌స్తుతం దేశంలోనే కాకుండా...ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు గురించి ప్ర‌ధాని మోదీ వివ‌రించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ``జమ్మూ కశ్మీర్, లడక్‌లో శాంతి స్థాపనే మా లక్ష్యం. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి సర్ధార్ వల్లాబాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లభించింది. జమ్ము కశ్మీర్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాయి. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ప్రజలకు అంతగా మేలు చేసేవే ఐతే స్వతంత్య్ర భారత దేశంలో 70 ఏళ్లుగా కశ్మీరీల జీవితాల్లో ఎందుకు మార్పు రాలేదు. అందుకే ఒకే జాతి- ఒకే రాజ్యంగం ఉండాలని దేశ ప్రజలతో పాటు కశ్మీరీ ప్రజలు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం`` అని ప్ర‌ధాని వివ‌రించారు.


ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో త‌మకు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తామ‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చారు. ``సుస్థిరమైన ప్రభుత్వంతోనే ప్రజలకు భరోసా కలుగుతుంది. అవినీతిని పారదోలేందుకు మొదటన్నుంచీ కృషి చేస్తున్నాం. పారదర్శకతతో కూడిన బాధ్యతాయుత పాలన అందిస్తున్నాం. ధరలను నియంత్రిచడం ద్వారా దేశాభివృద్ధి పెంపొదిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో విదేశాల్లోనూ విశ్వాసం పొందగలిగాం. సంపదను సృష్టించడమే ఈ దేశానికి నిజమైన సేవ. సంపద సృష్టికర్తలను మనమంతా గౌరవించాలి. రోజు రోజుకు ప్రజల ఆలోచన తీరు మారుతోంది. మౌలిక సదుపాయాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. చిన్న చిన్న సదుపాయాలతో ప్రజలు సంతృప్తి చెందడం లేదు. నిరంతరం మరింత అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కాదు.. విమానాశ్రయం ఎప్పుడొస్తుందని ప్రజలు అడుగుతున్నారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి వంద లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. జిల్లాలు ఎగుమతి హబ్‌లుగా ఎందుకు మారకూడదు? అధిక జనాభా వల్ల భావితరాలు సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అధిక జనాభాపై అవగాహన పెంచేలా ప్రజల్లో చర్చ జరగాలి`` అని ఆయ‌న హిత‌వు ప‌లికారు. 


ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే, ప్రజల ఆకాంక్షాల మేరకు పనికిరాని అనేక చట్టాలను తొలగించామ‌ని ఆయ‌న తెలిపారు. ``10 వారాల్లోనే ప్రజలకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం. వ్యవస్థలను గాడిలో పెట్టాం. వేగవంతంగా పని చేసేలా ముందుకెళ్తున్నాం. సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు చేశాం. వైద్యారోగ్య రంగంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలకు వరం లాంటిది.  తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు సాధికారత కల్పించాం. రాజ్యాంగ స్ఫూర్తితో ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం. ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నాం. అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నాం. పేదరిక నిర్మూలనకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. పేదల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ముందడుగు వేస్తున్నాం. ఒకే దేశం - ఒకే ఎన్నికలపై చర్చ జరగాలి. మా ఆలోచనలు, చర్యలన్నీ దేశ ప్రజల సౌభాగ్యం కోసమే. రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. శ్రేష్ఠ్ భారత్ కోసం నిరంతరం కృషి చేస్తాం. వచ్చే ఐదేళ్లకు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్నాం.`` అని తెలిపారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: