తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విధి నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోద‌రుడు కోనేరు కృష్ణ చేతిలో గాయ‌ప‌డిన ఎఫ్ఆర్ఓ అనిత‌కు అట‌వీశాఖ గోల్డ్‌మెడ‌ల్ ప్ర‌క‌టించింది. అట‌వీశాఖలో విశేష సేవలందించి మృతిచెందిన ఐఎఫ్‌ఎస్‌ కేవీఎస్‌ బాబు స్మారకార్థం ప్రతియేటా అటవీ శాఖ ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గోల్డ్‌మెడల్‌ అందించడంతో పాటు రూ.15,000 నగదును అందిస్తోంది. పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నామినేషన్లను పరిశీలించి ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీ ఈ ఏడాదికి కాగజ్‌నగర్‌ రేంజ్‌ అధికారి చోలె అనితను ఎంపిక చేసింది. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (హెడ్‌ ఆఫ్‌ పారెస్ట్‌ ఫోర్స్‌) ఆర్‌.శోభ ఉత్తర్వులు జారీ చేయ‌గా.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌ దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ అకాడమీలో ఆమె గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు. 


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు ఫారెస్ట్‌ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించి అక్కడకు చేరకున్న కోనేరు కృష్ణ, అతని అనుచరులు ఒక్కసారిగా ఆటవీశాఖ సిబ్బందిపైకి దూసుకొచ్చారు. అటవీ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎఫ్ఆర్వో చెప్పటంతో మరింత రెచ్చిపోయారు. వెంట తెచ్చుకున్న కర్రలతో ట్రాక్టర్‌పై బాదారు. ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే కోనేరు కృష్ణ మరింత రెచ్చిపోయాడు. కృష్ణ, అతని అనుచరుల దాడిలో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించ‌గా ఆమె కోలుకున్నారు. తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది ఒక్కసారిగా కర్రలతో తలపై కొట్టారని, ఆక్షణంలో తాను బతుకుతానని అనుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు.


ఇదిలాఉండ‌గా, ఈ దాడి కేసులో నిందితుడు కోనేరు కృష్ణకు బెయిలు మంజూరు చేయడానికి ఇటీవ‌ల‌ తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలంటూ కోరుతూ నిందితుడు కోనేరు కృష్ణ, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ గండికోట శ్రీదేవి... బెయిలు మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. బెయిల్‌కు న్యాయమూర్తి తిరస్కరించడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని ఆయన తరఫు లాయర్ అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి.. ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేనివారిని అరెస్టుచేసిన 22 మందికి బెయిలు మంజూరు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: