అవును మీరు చదివింది నిజమే. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి, నమ్ముకున్నవారిని ఆదుకునే విషయంలో తెలుగుదేశంపార్టీ నేతలు తెగ మెచ్చుకుంటున్నారు. నమ్ముకున్నవారిని అందలాలు ఎక్కించే విషయంలో జగన్-చంద్రబాబునాయుడు మధ్య తేడాలను టిడిపి నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

 

 

తొమ్మదిదేళ్ళ పోరాటం తర్వాత జగన్ మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే సిఎంగా బాధ్యతలు స్వీకరించారో వెంటనే తనను నమ్ముకున్నవారిని తనతో పాటు కష్టపడిన వారిని కీలక పదవుల్లో నియమిస్తున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు సాయం చేసిన వారు రిటైర్ అయినా సరే మళ్ళీ సలహాదారులుగా తీసుకున్నారు.


తొమ్మిదేళ్ళపాటు తనతోనే నడిచిన సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారునిగా నియమించారు. జివిడి కృష్ణమోహన్ ను మీడియా సలహాదారుగా చేశారు. పాదయాత్రకు బాగా ప్రచారం కల్పించిన శ్రీహరిని సిపిఆర్వోగా నియమించారు. ఎన్నికలో ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణను మంత్రిని చేశారు. ఎంఎల్ఏగా ఓడిపోయిన ఇక్బాల్ ను ఎంఎల్సీగా నామినేట్ చేశారు. సంవత్సరాల తరబడి పార్టీ వాణిని బలంగా వినిపించిన వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ చేశారని గుర్తుచేసుకున్నారు తమ్ముళ్ళు.

 

అదే టిడిపి విషయానికి వస్తే నమ్మినవాళ్ళను నట్టేట ముంచటమే చంద్రబాబుకు తెలిసిందని అనుకుంటున్నారు. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ తరపున ఎంతోమంది నేతలు పోరాటాలు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిని పట్టించుకోలేదట. మొన్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కూడా కొత్తవాళ్ళను, జనాల్లో ఏమాత్రం బలంలేని వాళ్ళనే అంలాలు ఎక్కించారు కానీ కష్టపడిన నేతల్లో చాలామందిని దూరం పెట్టేసిన విషయాన్ని తమ్ముళ్ళు గుర్తు చేసుకుంటున్నారు.

 

చంద్రబాబు అధికారులకే మొత్తం అధికారాలను కట్టబెడితే జగన్ మాత్రం ముందు మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు తర్వాతే  అధికారులు అన్న విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని తమ్ముళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే నమ్ముకున్న వాళ్ళకి గుర్తింపు ఇవ్వటం, అందలాలు ఎక్కించిన జగన్ ను వైసిపి నేతలు ఎలా వదిలేస్తారు అంటూ వాళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు. మరి  ఈ విషయాలు చంద్రబాబు చెవిలో పడతాయా ?


మరింత సమాచారం తెలుసుకోండి: