మైక్‌టైసన్‌... ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్‌. ఆయన ఒకసారి పిడికిలి బిగించి కొడితే కొన్ని లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి. ఆయన వైభవం అలా నడిచింది. వందల కోట్లు సంపాదించాడు. కానీ అంత‌లోనే ఆకాశం నుంచి పాతాళానికి ప‌డిపోయాడు. వ్యక్తిగత జీవితంలో దారి తప్పాడు. ఒకమ్మాయిపై అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యాడు. వందల కోట్ల సంపదను పోగొట్టుకున్నాడు. ఒక దశలో దివాలా తీసి రోడ్డు మీదికి వచ్చాడు. న్యూయార్క్‌ వీధుల్లో అదే బాక్సింగ్‌ విద్యను గాల్లో ప్రదర్శిస్తూ అడుక్కునేంత ప‌రిస్థితికి చేరాడు. 


అలాంటి టైస‌న్ తాజాగా మ‌రోమారు వార్త‌ల్లో నిలిచాడు. డ్రగ్స్‌ చట్టబద్ధమైన వ్యవహారం కావడంతో కాలిఫోర్నియాలో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొందరు మిత్రులతో కలిసి అతను 40 ఎకరాల్లో గంజాయి తోట పెంపకం చేపడుతున్నాడు. కాలిఫోర్నియాలోని ఆ ప్రాంతం లాస్ ఏంజిల్స్ నుంచి 177 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట.  ‘హాట్‌బాక్సిన్‌ విత్‌ మైక్‌ టైసన్‌’ కార్యక్రమంలో పాల్గొన్న టైస‌న్‌ తన గురించి షాకింగ్‌ విషయాలు తెలిపాడు. తాను, తన వ్యాపార భాగస్వామి ఎబెన్‌ బ్రిట్టన్ త‌మ వ్యాపారాన్ని లాభ‌దాయకంగానే న‌డిపిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. తామిద్ద‌రం కలిసి నెలకు 40 వేల డాలర్ల (రూ.28,38,000) విలువ చేసే ఒక రకమైన మత్తు పదార్థమైన వీడ్‌ను పీల్చుతామని చెప్పాడు. టైస‌న్ ఆనాడు త‌న ద‌మ్ముతో స‌త్తా చాటుకోగా...ఇప్పుడు ద‌మ్ము పీలుస్తూ డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


కాగా, గంజాయి పెంపకానికి అమెరికా ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలోఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మిత్రులతో కలిసి టైసన్‌ రంగంలోకి దిగాడు. అంతేకాకుండా 2018లో కెనాబిస్‌ పేరుతో కాలిఫోర్నియా నగరంలో రిసార్ట్‌ కూడా ప్రారంభించాడు. ఎంటిఎ పేరుతో ఫిట్నెస్ సెంటర్ల వ్యాపారాన్ని ఆరంభించి, తక్కువ సమయంలోనే లాభాల బాట పట్టించాడు. గ‌త ఏడాది టైస‌న్ భార‌త‌దేశంలో పర్య‌టించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: