రాఖీ పేరు వినగానే అన్నా చెల్లెళ్ల అనురాగం….. అక్కా తమ్ముళ్ల ఆత్మీయత కళ్ల ముందు కనిపిస్తుంది. తోడబుట్టిన వారు కలకలం ఆనందంగా ఉండాలని కోరుతూ కట్టే బంధనమే రక్షా బంధనం. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ… సోదర ప్రేమకి ప్రతీక. సోదరుడి చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు తోబుట్టువులు. అన్నల ఆశీస్సులు తమకు శ్రీరామ రక్షలా ఉండాలని ప్రార్థిస్తూ… జన్మ జన్మలకు ఇలాగే తమ రక్తసంబంధం కొనసాగాలని దేవుడిని ఆడబిడ్డలు వేడుకుంటారు.ఈ పండుగ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సంద‌డి కొన‌సాగుతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ‌కు ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల అధికారిక నివాసాలు సైతం వేదిక‌గా మారాయి. ఇటు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో అటు అమరావతిలోని రాజ్‌భ‌వ‌న్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇరు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు. 


హైద‌రాబాద్‌లో రాజ్‌భవన్‌కు వచ్చిన  పలువురు విద్యార్థినులు, బ్రహ్మకుమారీలు గవర్నర్‌ నరసింహన్‌కు రాఖీ కట్టారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్‌తో పాటుగా ఆయ‌న స‌తీమ‌ణి విమ‌లా న‌ర‌సింహ‌న్ సైతం పాల్గొన్నారు. మ‌రోవైపు ఏపీ రాజ్‌భవన్‌లోనూ రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ బిశ్వభూషన్‌కు విద్యార్థులు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కాసేపు గ‌వ‌ర్న‌ర్ ముచ్చ‌టించి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.


ఇదిలాఉండ‌గా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: