టాలీవుడ్ లో పేరడీ డైలాగ్స్ చెబుతూ..థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీలో అంటూ కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ ఫృథ్విరాజ్.  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్నా చితక పాత్రల్లో నటించిన ఫృథ్వి తర్వాత కృష్ణ వంశి దర్శకత్వంలో రవితేజ,శ్రీకాంత్ నటించిన ‘ఖడ్గం’ చిత్రంలో థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మాతో పోటీనా అనే డైలాగ్ ఫృథ్వికి మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఆ తర్వాత వరుసగా కమెడియన్ గా తన సత్తా చాటుతూ..హిట్ చిత్రాల పేరడీ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వించడం మొదలు పెట్టాడు.  కమెడియన్ గా బిజీగా ఉంటూనే రాజకీయాల వైపు దృష్టి కేంద్రీకరించారు ఫృథ్వి. 

ఈ నేపథ్యంలో ఏపిలో వైస్ జగన్ స్థాపించిన వైఎస్సాఆర్ సీపి పార్టీలో జాయిన్ అయ్యాడు.  అప్పటి నుంచి జగన్ గురించి అప్పటి టీడీపీ పరిపాలనపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు.  జగన్ వెంట ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఇలా వైసీపీలో ఓ కీలక వ్యక్తిగా కమెడియన్ ఫృథ్వి ఎదిగారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫృథ్వి సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల వైపు వచ్చారు.  మొత్తానికి తాము అనుకున్నదే జరిగింది..తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారు ఏపి ప్రజలు. 

అయితే తాను ప్రజా సంకల్ప యాత్ర సమయంలో అండగా ఉన్న అందరికీ జగన్ ఎదో ఒక కీలక పదవులు అప్పజెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫృథ్వికి కూడా కీలక పదవి దక్కింది. ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లా  చంద్రగిరిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించి స్వాతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫృథ్వి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపితే బాగుండు అన్నానని..తాను ఏమీ తప్పుగా మాట్లాడలేదే అని ప్రశ్నించారు. కానీ తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని  పృథ్వీ ఆరోపించారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆయనకు శాలువాలు కప్పి పెద్ద పెద్ద సన్మానాలు చేస్తారని..జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశారని, కానీ ఇప్పుడు  అవన్నీ మర్చిపోయారని అన్నారు.  సీఎం జగన్ ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ.. లోకేష్ పుట్టడని ఎద్దేవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: