కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 70 ఏళ్లుగా ఏ భారత ప్రధాని కూడా చేయనంతటి సాహసం మోడీ చేసిన తరువాత పొరుగుదేశం పాకిస్థాన్ భారత్ పై గుర్రుగా ఉంది. ఇరు దేశాల మధ్య కీలకమైన కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన ద్వారా భారత్ పెద్ద ముందడుగు వేసిందనే చెప్పాలి.


భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలనుకున్న పాక్ పన్నాగమూ ఫలించలేదు. చైనా మినహా ఏ దేశమూ దీన్నో సమస్యగానే పట్టించుకోలేదు. దీంతో పాకిస్తాన్ భారత్ ను ఏదో విధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. చివరకు భారత్ పై యుద్ధానికైనా సిద్ధమేనంటూ ఆగస్ట్ 14న పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించడం ఆ దేశ దుగ్దకు అద్దం పడుతోంది.


ఇలాంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకున్నాకనే రంగంలోకి దిగిన మోడీ సర్కారు పాక్ కుట్రలను తిప్పికొడుతోంది. కశ్మీర్ పై కీలక నిర్ణయం తర్వాత పాకిస్థాన్ మళ్లీ ఎల్వోసీ వెంబటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోంది. దీంతో భారత్ కూడా దీటుగానే బదులిస్తోంది. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి ఉరీ, రాజౌరీ సెక్టర్‌లలో భారత సైన్యం కాల్పులకు ముగ్గురు పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారు. గురువారం పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల భారత్‌ దీటుగా స్పందించాల్సి వచ్చిందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.


ఇదే అంశంపై పాక్ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. తాము భారత సైనికులు ఐదుగురిని చంపామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఈ దాడిలో పాక్‌కు చెందిన ముగ్గురు సైనికులు భారత సైన్యం కాల్పులకు మరణించారని పాక్ చెబుతోంది. ఐదురుగు భారత సైనికులు చనిపోయారంటూ పాక్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌ అసిఫ్ గఫూర్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. భారత్ - పాక్ ఎదురు కాల్పుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఇద్దరు పౌరులు కూడా మరణించినట్టు ఓ పాకిస్తాన్ పత్రిక కూడా తెలిపింది. మొత్తం మీద పరిస్థితి చూస్తే భారత్ - పాక్ మధ్య మరోసారి తీవ్రఉద్రిక్తతలు తలెత్తినట్టే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: