కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలకఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బాహుబలిగా పిలుస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల మోటర్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజూ రెండు టీఎంసీల జలాలను ఎత్తిపోయగల పంపు హౌస్‌ పూర్తిస్థాయిలో ముస్తాబైంది.

ఆసియాలోనే అతిపెద్ద మోటార్ల ద్వారా గోదావరి జలాలను ఎత్తి పోసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాళేశ్వరం నుంచి మిడ్ మానేరుకు...అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించనున్నారు. ఒక్కో మోటార్ 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగి ఉంటుంది. హార్స్ పవర్‌లో చెప్పాలంటే ఒక్కో మోటర్ ఒక లక్షా ఎనభై తొమ్మిది వేల హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 115 మీటర్ల లోతులో నీటిని ఎత్తిపోసే శక్తి ఉంటుంది. అవును.. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కాదు...ఆసియాలోనే అతిపెద్ద  మోటార్లను కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ ప్యాకేజీలో అమర్చారు. లింక్ 1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లతో పాటు కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలను ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో తరలించే దశ విజయవంతంగా పూర్తయింది.  

ఇప్పడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని లిప్ట్ చేసేందుకు లింక్ 2 దశ ఆరంభం కాబోతుంది. ఇప్పటివరకు భూ ఉపరితలం ద్వారా గోదావరి జలాలను తరలిస్తే...లింక్ 2 లో మాత్రం సొరంగాల మార్గాన నీటిని తరలిస్తారు. ఇందుకోసం... నంది మేడారం 6వ ప్యాకేజీలో 125 మెగావాట్ల మోటార్లను అమరిస్తే...8వ ప్యాకేజీ లక్ష్మిపూర్‌లో 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7 భారీ మోటార్లను బిగించారు. భూ గర్భంలో దాదాపు 130 మీటర్ల లోతులో ఈ మెటార్లను బిగించారు. నంది మేడారం 6వ ప్యాకేజీ, మల్లాపూర్ 7వ ప్యాకేజీ, లక్ష్మిపూర్ 8 ప్యాకేజీలోని రెండు జంట సోరంగాల మార్గాన నీటిని తరలిస్తారు. 6వ ప్యాకేజీ నంది మేడారంకు ముందుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు 2.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా 1.1 కిలోమీటర్ గ్రావిటి కెనాల్ ద్వారా నీరు ప్రవహించి... 6వ ప్యాకేజీలోని సర్జ్ పూల్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 125 మెగావాట్ల సామర్ధ్యం గల 7 మోటర్లు నీటిని 105 మీటర్ల ఎత్తులోకి ఎత్తి.. డెలివరీ సిస్టమ్స్ ద్వారా గ్రావిటీ కెనాల్లో పోయడంతో... అక్కడి నుంచి నేరుగా నీరంతా నంది మేడారం రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. నందిమేడారం రిజర్వాయర్ నుంచి 9కిలోమీటర్ల పొడవున్న 7వ ప్యాకేజిలోని రెండు జంట సొరంగ మార్గాల ద్వారా 8వ ప్యాకేజిలోకి నీరు వస్తుంది. అంటే.. నంది మేడారం నుంచి లక్ష్మీపూర్‌కు దాదాపుగా 15 కిలోమీటర్ల మేర సొరంగ మార్గంలోనే నీరు తరలిస్తారు. అయితే.. ఈ నీటిని తరలించడానికి చేపట్టిన సొరంగాల నిర్మాణం ఓ అద్భుతమనే చెప్పాలి. గుట్టలను తొలిచి దాదాపుగా 130 మీటర్ల లోతులో నిర్మించిన కట్టడాలు... ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పడుతాయి. 

సొరంగ మార్గాల ద్వారా తరలివచ్చిన నీటిని ముందుగా సర్జ్ పూల్‌కు తరలిస్తారు. సర్జ్ పూల్ చేరిన నీటిని డ్రాప్ట్ ట్యూబ్‌ల ద్వారా మోటార్ల అడుగు భాగంలోకి  పంపించి.. అక్కడి నుంచి పంపింగ్ ప్రారంభిస్తారు. బాహుబలి మోటార్ల రన్ కావాలంటే అంత సులభమైన ప్రకియ కాదు. అందుకోసం... ఎంతో మంది ఇంజనీర్లు కష్టపడాల్సి ఉంటుంది. ఏ ఒక్క చోట చిన్న తప్పిదం జరిగినా.. నీటి తరలింపు ముందుకు సాగదు. అందుకోసం.. ఇంజనీరింగ్, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుంటూ మోటార్లను రన్ చేస్తారు. ఈ భారీ మోటర్లకు ఒక్కో మోటార్‌కు ఒక్కో కంట్రోల్ యూనిట్‌ను నిర్మించారు. 8వ ప్యాకేజీలోకి చేరిన నీటిని మోటార్ల ద్వారా ఎత్తి పోసి...గ్రావిటీ కాలువల ద్వారా మిడ్ మానేరుకు... పునర్జీవ పథకం ద్వారా ఎస్ఆర్ ఎస్ పి ప్రాజెక్టులోకి తరలింపు జరుగుతుంది. ఒక టీఎంసీ మిడ్ మానేరుకు...మరో టీఎంసీ వరద కాలువల ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీటిని మళ్లిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: