గవర్నర్ ఎట్ హోం అన్నది బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్న ఓ సంప్రదాయం. రాజకీయ నాయకులను, ప్రముఖులను  గవర్నర్ ఆహ్వానించి వారితో తేనీటి విందు ఆరగిస్తారు. ప్రతీసారి ఉమ్మడి ఏపీ గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ రాజ్ భవన్లో ఏర్పాటు చేసే ఎట్ హోం కార్యక్రమానికి  వెల్లువలా నాయకులు వచ్చేవారు. అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ నేతలతో రాజ్ భవన్ సందడే సందడి అన్నట్లుగా ఉండేది.


ఈసారి ఏపీకి కొత్త గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వచ్చారు. ఆయన రాజ్ భవన్లో ఆగస్ట్ 15 సందర్భంగా సాయంత్రం ఇచ్చిన ఎట్ హోం తేనేటి విందులో ఈసారి నాయకుల సందడి తగ్గిపోయింది. ప్రతీ సారి ఎట్ హోం కి తప్పకుండా వచ్చే జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈసారి కనిపించకపోవడం చర్చగా ఉంది. ఆయన ఉమ్మడి ఏపీ ఎట్ హోం లో కచ్చితంగా కనిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు. అంతెందుకు ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలక సందర్భంగా నరసింహన్ ఇచ్చిన ఎట్ హోం కి కూడా పవన్ హాజరయ్యారు. కానీ సొంత రాష్ట్ర గవర్నర్ హరి చందన్ ఇచ్చిన ఎట్ హోం లో పవన్ జాడ లేదు.


ఇక ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు సైతం రాలేదు. గతంలో సీఎం గా ఉన్నపుడు కూడా బాబు నరసింహన్ ఎట్ హోం కి ఒకటి రెండు సార్లు తప్ప హాజరు కాలేదు. జగన్ సైతం విపక్ష నేతగా అప్పట్లో ఒకసారి హాజరయ్యారు. ఇపుడు సీఎం హోదాలో జగన్ ఎట్ హోం వేడుకల్లో తొలిసారి పాల్గొంటే టీడీపీ ఏపీ అధ్యక్సుడు కళా వెంకటరావు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు వచ్చారు. దాంతో రాజకీయ సందడి పెద్దగా లేకుండానే ఎట్ హోం ముగిసింది.


నిజానికి ఎట్ హోం వంటి కార్యక్రమాలు రాజ‌కీయ సఖ్యత కోసం, నేతల మధ్యన స్నేహ పూర్వక వాతావరణం కోసం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశ్యం. కానీ రాజకీయాలే పరమావధి గా మారి ఫలాన ఆయన వస్తున్నారంటే మరో నేత డుమ్మా కొట్టడం ఇపుడు ఎట్ హోం కల్చర్ అయిపోయింది. ఏది ఏమైనా పెద్దాయన, రాష్ట్రానికి తొలి పౌరుడు అయిన గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు నేతలంతా విభేదాలు మాని హాజ‌రైతే ఆ సన్నివేశం ప్రజలకు కూడా చూసేందుకు ఎంతో బాగుంటుంది.  రాష్ట్రం కూడా సామరస్య వైఖరితో అభివ్రుధ్ధి చెందుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: