నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆశయంతో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకానికి ఈ రోజు నుండి తెలంగాణలో సేవలు నిలిపివేసారు. ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన బిల్లులను ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవటంతో ఈ పథకానికి సమస్యలు మొదలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని ఇంతకాలం ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటం వలన ప్రైవేట్ ఆసుపత్రులకు ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సంఘం ఈ విషయం గురించి ఇప్పటికే చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఐనా ఫలితం లేకపోవటంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది. 2007లో ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభమైంది. సుమారుగా 240 ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం 940 రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీ పథకం క్రింద సేవలు అందుతున్నాయి. 96 ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాయి.

1500 కోట్ల రుపాయల బకాయిలు ప్రభుత్వం నుండి అందాల్సి ఉందని సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు 1500 కోట్ల రుపాయల బకాయిలతో పాటు, ప్యాకేజీ రేట్స్ విషయంలో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 2018 నవంబర్ నెలలోనే బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరగా, బకాయిలను వెంటనే చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. 
 
ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవటంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కనీసం 70 శాతం బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకం క్రింద ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుపాయల వరకు వైద్యం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: