రిల‌య‌న్స్ దిగ్గ‌జం, భారతీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అనేక సంద‌ర్భాల్లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో ఆయ‌న సంప‌ద పెరిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే రీతిలో రెండు రోజుల్లోనే దాదాపు రూ.29 వేల కోట్లు ఎగబాకింది. ఇందుకు కార‌ణం, జియో ఫైబర్ ఆఫర్, సౌదీ ఆరామ్‌కో రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులు, 18 నెలల్లో రుణ రహిత రిలయన్స్ లక్ష్యం, బ్రిటిష్ పెట్రోలియం రూ.7 వేల కోట్ల పెట్టుబడులు తదితర ప్రకటనలు, ఒప్పందాలు మదుపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 42వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జరిగిన దగ్గర్నుంచి ఆ సంస్థ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న అంబానీ సంపద విలువ రికార్డు స్థాయిలో ఎగిసింది మరి. దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు రోజైన సోమవారం ఏజీఎం జరుగగా, మంగళ, బుధవారం ట్రేడింగుల్లో రిలయన్స్ మార్కెట్ విలువ విపరీతంగా పుంజుకుంది. అంతర్జాతీయ ఆందోళనల కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైనా.. రిలయన్స్ షేర్ విలువ మాత్రం 10 శాతం లాభపడింది. శుక్రవారం రూ.1,162 వద్ద ముగిసిన రిలయన్స్ షేర్ విలువ.. బుధవారం రూ.1,288.30 వద్ద నిలిచింది. దీంతో మంగళ, బుధవారాల్లో సంస్థ మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్లు (రూ.28,684 కోట్లు) పెరిగింది. దీంతో ముఖేశ్ సంప‌ద‌న భారీగా పెరిగింది.


కాగా, రిల‌య‌న్స్ ఏజీఎంలో జియో ఫైబ‌ర్ రూపంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఉచితంగా హెచ్‌డీటీవీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ ఇస్తారు. దానికి సెట్‌టాప్ బాక్సు కూడా ఉచితమే! ల్యాండ్‌లైన్‌పై జీవితాంతం ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు! జియో ఫస్ట్‌డే ఫస్ట్ షో ఆఫర్‌లో థియేటర్‌లో సినిమా విడుదలైన రోజే.. టీవీలో చూసే అవకాశం కల్పిస్తారు! ఇవన్నీ త్వరలో మార్కెట్‌లో పెను సంచలనాలకు దారితీయనున్న రిలయన్స్ జియోఫైబర్‌లోని అద్భుతాలు! అందుకే వినియోగ‌దారుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చి రిల‌య‌న్స్ అధినేత పెద్ద మొత్తం సొమ్ము చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: