ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురై రెండు నెలలైనా తెలుగుదేశంపార్టీ నేతలు కోలుకోలేదని అర్ధమైపోతోంది. ఘోర పరాజయాన్ని పదే పదే తలుచుకుని చంద్రబాబునాయుడు ఇప్పటికి కూడా తెగ బాధపడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే పత్తికొండలో జరిగిన పార్టీ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి భోరుమని ఏడ్చేశారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పత్తికొండలో పోటి చేసిన కొడుకు కెఇ శ్యాంబాబు, పార్టీ నేతలతో కెఇ  సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తన కొడుకు 45 వేల ఓట్ల భారీ తేడాతో  ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోతేన్నట్లు భోరుమని ఏడ్చేశారు. ఏదేళ్ళల్లో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా జనాలు ఎందుకు ఓట్లేయలేదో అర్ధం కావటం లేదన్నారు.

 

పార్టీకి జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం కంచుకోట లాంటిదన్నారు. అలాంటిది అంత భారీ తేడాతో ఎందుకు ఓడిపోయామో  చెప్పాలంటూ నేతలను కెఇ అడిగారు. మరి నేతలు ఏమి సమాధానం చెప్పారో మాత్రం బయటకు పొక్కలేదు లేండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భారీ తేడాతో ఓటమికి కెఇ కుటుంబం స్వయంకృతం కూడా ఉందని గుర్తుంచుకోవాలి. చంద్రబాబునాయుడు మీదున్న వ్యతిరేకతకు తోడుగా కెఇ కుటుంబంపైన ఉన్న వ్యతిరేకత కూడా కలిసింది.

 

నియోజకవర్గంలో బాగా పాపులరైన వైసిపి నేత చెఱుకులపాడు నారాయణరెడ్డి హత్యలో కెఇ శ్యాంబాబే ప్రధాన ముద్దాయి. శ్యాంబాబుతో పాటు మరికొందరి పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారంటే అర్ధమేంటి ? తన భర్త నారాయణరెడ్డి హత్యకు గురైన దగ్గర నుండి ఆయన భార్య శ్రీదేవిరెడ్డి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. దానికితోడు వైసిపి తరపున జగన్ ఏడాది ముందే ప్రకటించిన మొట్టమొదటి టికెట్టే శ్రీదేవిది.


తన అభ్యర్ధిత్వం ప్రకటించిన దగ్గర నుండి ఆమె నియోజకవర్గంలోనే తిరుగుతోంది. చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత, పాదయాత్ర తదితరాల కారణంగా వైసిపికి వచ్చిన ఊపు, శ్రీదేవి మీద సానుభూతి అన్నీ కలిపి వైసిపికి 45 వేల మెజారిటి వచ్చింది. ఈ విషయాలు కెఇకి తెలీక కాదు. అయినా తనలోని బాధను బయటకు కక్కేయటానికి ఏదో ఓ మార్గం కావలి కదా అంతే.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: