పాకిస్థాన్ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. సరిహద్దు రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ అదే స‌మ‌యంలో ఇండియాకు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి కాల్పులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గురువారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఎదురు కాల్పుల్లో.. పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందారు.అయితే, పాక్ జరిపిన కాల్పుల్లో ఐదురుగు భారత సైనికులు చనిపోయారని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ గురువారం ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన భారత సైన్యం పాక్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. అయితే దీనికి స్పందిస్తూ మ‌న‌ డిప్యూటీ హైక‌మిష‌న‌ర్‌కు పాక్‌ నోటీసులు ఇచ్చింది. 


త‌మ దేశ సైనికులు జ‌రిపిన కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారన్న పాకిస్థాన్ ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ కల్పిత వాదనలేనని కొట్టిపారేసింది. ``పాక్ వాదనలు కల్పితం. పాక్ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం`` అని భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ అన్నారు. నియంత్రణ రేఖ వెంబడి గురువారం పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల భారత్ దీటుగా స్పందించాల్సి వచ్చిందని.. భారత్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాక్ సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. ఇంత‌స్ప‌ష్టంగా వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికీ....పాక్ త‌న దూకుడు చ‌ర్య‌లు మార్చుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ అహ్లూవాలియాకు దక్షిణాసియా, సార్క్‌ దేశాల పాకిస్థాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మహ్మద్‌ ఫైజల్‌ నోటీసులు అందజేశారు.


ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే  పాక్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ భార‌త్‌ను రెచ్చ‌గొట్టే కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త ప్ర‌భుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసిందని, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాశ్మీర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి యునైటెడ్ నేషన్స్ సహా  ప్రపంచంలోని అన్ని వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: