జగన్మోహన్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా ఉందంటున్నారు తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ జగన్ పాలన బుగుందని కితాబిచ్చారు. అయితే నవరత్నాల అమలుకు నిధులు కొరతతో జగన్ ఇబ్బంది పడుతున్నట్లు రాయపాటి అభిప్రాయపడ్డారు. కేంద్రం కూడా అవసమైనన్ని నిధులు  రాష్ట్రానికి ఇవ్వటం లేదని చెప్పారు.  

 

అంతా బాగానే ఉంది కానీ ఒకవైపు చంద్రబాబునాయుడు ఆయన మరోవైపు ఆయన పుత్రరత్నం నారా లోకేష్ మాత్రం ప్రతిరోజు అయినదానికి కాని దానికి జగన్ కు వ్యతిరేకంగా  ట్విట్టర్లో చెలరేగిపోతున్నారు.  ఆగస్టు 15వ తేదీ సందర్భంగా తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలను విద్యుత్ బల్బులతో అలంకరించటాన్ని కూడా చంద్రబాబు వ్యంగ్యంగా ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.

 

ఈ నేపధ్యంలో  జగన్ పాలన చాలా బాగుందని రాయపాటి చెప్పటమే పార్టీలో సంచలనంగా మారింది.  చంద్రబాబు అభిప్రాయానికి భిన్నంగా రాయపాటి జగన్ ను మెచ్చుకోవటం ఏమిటంటూ చాలామంది నేతలు మండిపోతున్నారు. అయితే ఇక్కడ టిడిపి నేతలు గమనించాల్సిన విషయం ఒకటుంది.

 

జగన్ పాలనపై చంద్రబాబు, లోకేష్ లో ఉన్నంత మంట చాలామంది నేతల్లో లేదన్నది వాస్తవం. ఆ విషయం బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా అర్ధమవుతోంది. జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేంత వరకూ మనం వెయిట్ చేయక తప్పదని చింతకాయల నేరుగా చంద్రబాబుకే చెప్పిన విషయం అందరూ విన్నదే.

 

 అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మ్యానిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ ను క్రమపద్దతిలోకి తెస్తున్నారు. లక్షలాది వాలంటీర్లను నియమించారు. గ్రామ సచివాలయాల పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రెడీ అవుతున్నాయి. జగన్ తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలే తండ్రి, కొడుకులకు ఏమాత్రం రుచించటం లేదు. అందుకే అవకాశం లేకపోయినా మండుతున్నారు. మరి ఆ మంట మిగిలిన నేతలకు ఉండద్దా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: