తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ నిధులు సర్దుబాటు కాగానే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. బంగారం రుణాలతో సహా లక్ష చొప్పున మాఫీ కానుంది. పంట రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతుల పంట బంగారు రుణాల మాఫీకి సంబంధించి నిధుల సర్దుబాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు నిధుల సర్దుబాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.


నిధులు సర్దుబాటు కాగానే ఆర్ధిక శాఖ మార్గ దర్శకాలను విడుదల చేయనుంది. అయితే రుణమాఫీపై వ్యవసాయ శాఖకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. రుణమాఫీ కోసం 2018 డిసెంబర్ 11వ తేదీని కటాఫ్ గా తీసుకున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. వీరిలో 42.36 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలు 32262 కోట్లు ఉన్నాయి.


మరో 5.56 లక్షల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి 5250 కోట్ల రుణం తీసుకున్నారు. వీరిలో ఒక లక్ష కంటే ఎక్కువగా ఉన్న రుణాలు 576 కోట్లు ఉన్నాయి. ఇవిపోనూ మాఫీ చేయవలసిన మొత్తం 31824 కోట్లు. 2014లో రుణమాఫీ పథకం అమలు చేసినప్పుడు 17 వేల కోట్లు బకాయిలు ఉండేవి. అప్పుడు నాలుగు విడతలుగా మాఫీ చేశారు. ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మార్గ దర్శకాలను విడుదల చేసిన అనంతరం గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను క్రోడీకరించనున్నారు. కుటుంబంలో ఎంతమంది పేరు మీదా అప్పు ఉన్నప్పటికీ లక్ష రూపాయల వరకు మాఫీ అవుతుంది. బ్యాంకులు డేటా షేరింగ్ ద్వారా డూప్లికేట్స్ లేకుండా నియంత్రించే అవకాశముంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: