ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా వేడెక్కాయి.  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద డ్రోన్లు చక్కర్లు కొట్టాయని..దాని వెనుక ఉన్న రహస్యం ఏంటని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.  మరోవైపు చంద్రబాబు నాయుడికి ప్రొటెక్షన్ లేకుండా పోతుందని, ఆయనపై హత్యయత్నానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గరకు దేవినేని ఉమ, వర్ల రామయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆలపాటి రాజాతో పాటు చాలామంది టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. 

అయితే ఇటీవల ఆయన భద్రత పెంపు విషయంలో కోర్టులో తర్జన భర్జన జరుగుతున్న విషయం తెలిసిందే.  కాగా, చంద్రబాబు నివాసం వద్ద  డ్రోన్ కెమెరా వినియోగించడంపై  టీడీపీ శ్రేణులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీసిన వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు పట్టుకొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. 

పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే డ్రోన్ వ్యవహారంపై ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వివరణ ఇచ్చింది.  ప్రస్తుతం ఏపిలో భారీగా వర్షాలు పడటంతో ముంపు పరిస్థితిని అంచనా వేసేందుకు  నీటి విడుదలను ఎక్కువగా పెంచితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేసేందుకు గాను డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్టుగా ఇరిగేషన్ శాఖ వారు అంటున్నారు.

కానీ, ఇది సరైన సమాధానం కాదంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ  చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: