ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మద్యం నిషేధానికి వెళుతున్నామని వైసిపి ప్రభుత్వం ప్రకటించటంతో ఆదాయం కూడా తగ్గించుకుంటుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అదనపు ఆదాయంపై వైసీపీ ప్రభుత్వం అంచనాలు వేసుకుంది. గతేడాది ఎక్సైజ్ ఆదాయం ఆరువేల రెండు వందల ఇరవై కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల ఐదు వందల పదిహెడు కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ లో అంచనా వేసింది. అంటే గతేడాది కంటే రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.


అది కూడా కేవలం ఎక్సైజ్ ఆదాయం మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం అంటే ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ లైసెన్స్ ఫీజులు జరిమానాలూ ఉంటాయి. కానీ అమ్మకాలపై వేసే వ్యాట్ రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. ఎక్సైజ్ ఆదాయం కంటే వ్యాట్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు ఎక్సైజ్ ఆదాయం అంటే వ్యాట్ రూపంలో వచ్చేది కూడా కలిపితే ఈ ఏడాది ఐదు వేల కోట్లు అదనంగా వస్తాయని ప్రభుత్వం ఆశిస్తున్న లెక్క. మద్యపానం మరింత ప్రియంకానుంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమలులోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ధరను పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు.


అయితే ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఆదాయం తగ్గకుండా ఉండటమే కాదు గతేడాది కంటే ఎక్కువ రావాలంటే స్వల్పంగా ధరలు పెంచటం ఒక్కటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా ప్రస్తుత ధరలను పది శాతం పెంచాలని యోచిస్తోంది. అయితే ఈ పెంపు వల్ల ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కేవలం ఎక్సైజ్ డ్యూటీలు మాత్రమే పెంచుతారు.



దీనివల్ల ఉత్పత్తిదారులకూ అదే ఖర్చు కాగా ప్రభుత్వానికి మాత్రం అదనపు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఎంత పెంచినా సీసాపై కనీసం పది రూపాయలు పెరుగుతుంది. ఎందుకంటే మద్యం అమ్మకాల్లో 'పది రౌండ్ ఆఫ్' విధానముంది. ప్రస్తుతం ధరలు అందుకు అనుగుణంగా చివర్లో సున్నాతో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తక్కువ పెంచాలని భావించి ఒక్కో సీసాపై రెండు లేదా మూడు రూపాయలు పెంచినా రౌండాఫ్ లో భాగంగా అది పది రూపాయలవుతుంది. అంటే యాభై రుపాయలు సీసాపై రెండు రూపాయలు పెంచితే యాభై రెండు రూపాయల కావాలి కానీ అది అరవై రూపాయలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: