క‌శ్మీర్‌లో ప‌రిణామాలు మారుతున్నాయి.  ఆర్టికల్ 370 రద్దుపై పాక్ త‌న క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తోంది. కశ్మీర్ ప్రజల స్వేచ్ఛను కాపాడేందుకు అవసరమైతే యుద్ధానికి సిద్ధమని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ప్రకటన చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా, జమ్ము, కశ్మీర్‌లలో అలజడులు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనేలా చేయాలని ప్రయత్నిస్తోంది. పాక్ ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్టిన నిఘా వర్గాలు కశ్మీర్‌ లోయలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు చోట్ల దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.


ఉగ్రవాదులను పురికొల్పడం ద్వారా అశాంతి నెలకొల్పి, ఆ నెపాన్ని స్థానికులపైకి నెట్టాలని దాయాది దేశం భావిస్తోంది. దీంతో,జమ్ము, కశ్మీర్‌లో ఆర్మీ, వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఈ సమాచారం నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రత, వైమానిక దళాలకు సూచించారు. ఉన్నతాధికారులు కశ్మీర్‌లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. 
ఇదిలాఉండ‌గా, అణ్వాయుధాల వినియోగంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచ‌ల‌న‌ కామెంట్ చేశారు. మొద‌ట‌గా అణ్వాయుధాన్ని వాడ‌రాద‌న్న విధానం ఎప్పుడైనా మారే అవ‌కాశం ఉంద‌న్నారు. ఎవ‌రు తొంద‌ర‌ప‌డ్డా.. తాము అణ్వాయుధాన్ని ప్ర‌యోగించ‌రాదు అన్న సిద్ధాంతానికి భార‌త్ కొన్నేళ్లుగా క‌ట్టుబ‌డి ఉంది. కానీ భ‌విష్య‌త్తు ప‌రిణామాల దృష్ట్యా ఆ విధానం మారే అవ‌కాశం ఉంద‌ని ఇవాళ రాజ్‌నాథ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. పోక్రాన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  కేవ‌లం ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే అణ్వాయుధాల‌న్న సిద్ధాంతాన్ని మార్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. ప్ర‌తిదాడి కోసం కూడా అణ్వాయుధం వాడ‌ల‌న్న విధానాన్ని అవ‌లంబించాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.


మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి ప్ర‌థ‌మ వ‌ర్థంతి నేప‌థ్యంలో కేంద్ర మంత్రి పోక్రాన్‌లో ప్ర‌త్యేకంగా వాజ్‌పేయికి నివాళి అర్పించారు. 1998లో వాజ్‌పేయి హ‌యాంలోనే పోక్రాన్‌లో అణుప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ ఆ స‌మ‌యంలో ర‌హ‌స్యంగా మొత్తం అయిదుసార్లు అణుప‌రీక్ష‌లు చేసింది. పోక్రాన్‌-2 న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌ల అనంత‌రం నో ఫ‌స్ట్ యూజ్ (ఎన్ఎఫ్‌యూ) పాల‌సీకి భార‌త్ ఆమోదం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: