కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ను పాకిస్థానీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ గుడ్డి వ్య‌తిరేక‌త న‌ర‌న‌రానికి చేరుకొని కొందరు పాక్ దేశస్తులు లండన్‌లో భారతీయులపై దాడి చేశారు. ప‌లువురు భారతీయులు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుండగా అడ్డుపడి భారతీయుల్ని కొట్టారు. లండన్‌లోని ఇండియన్ ఎంబసీ దగ్గర జరిగిన దాడికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని  వేడుకలు నిర్వహిస్తుండగా.. భారతీయులపై పాక్‌కు చెందిన ఆందోళనకారులు కత్తితో దాడి చేసినట్టు లండన్ పోలీసులు వెల్లడించారు. భార‌తీయుల ఫిర్యాదు నేప‌థ్యంలో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఇదిలాఉండ‌గా, వందలాది మంది కశ్మీరీ మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. జమ్మూకశ్మీర్‌ అంశంపై ఈ రోజు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రహస్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వారు భారత కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. పాక్‌ జెండాలు, కశ్మీరీ జెండాలు పట్టుకుని బ్యానర్లు ప్రదర్శిస్తూ కశ్మీరీకి స్వేచ్ఛనివ్వండంటూ నినాదాలు చేశారు. 


మ‌రోవైపు, ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా గురువారం భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పాకిస్థాన్ బ్లాక్‌డేగా పాటించింది. పలుప్రాంతాల్లో ఇండ్లపై, వాహనాలపై నల్ల జెండాలు కనిపించాయి. ఇస్లామిక్ సంస్థల ఆధ్వర్యంలో పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, సదస్సులు జరిగాయి. మరోవైపు భారతీయ నటులు కనిపించే వాణిజ్య ప్రకటనలను కూడా పాకిస్థాన్ తాజాగా నిషేధించింది.


ఇదిలాఉండ‌గా,కశ్మీర్ వివాదంపై అంతర్గత సమావేశం జరుపాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి నిర్ణయించింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణాన్ని రద్దుచేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం అంతర్గత సమావేశం జరుపాలని నిర్ణయించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని, కశ్మీర్ అంశాన్ని ఎజెండాలో చేర్చారని పలువురు దౌత్యవేత్తలు తెలిపారు. కశ్మీర్‌పై చర్చించడం అత్యంత అరుదైన సందర్భమని చెప్పారు. ఈ సమావేశాన్ని పూర్తిస్థాయి భద్రతామండలి సమావేశంగా పరిగణించకున్నా.. అంతర్గత సంప్రదింపులు (క్లోజ్డ్ డోర్ కన్సల్టేషన్స్) జరుగుతాయని, ఇటీవలి కాలంలో ఇటువంటివి సాధారణంగా మారాయన్నారు. కశ్మీర్‌పై 1965లో చివరిసారిగా ఐరాస భద్రతామండలి పూర్తిస్థాయి సమావేశం జరిగింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: