మోహన్‌ దాస్‌ పాయ్‌...కర్ణాటకకు చెందిన బడా పారిశ్రామిక వేత్త, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్. అక్షయపాత్ర సహవ్యవస్థాపకుడు,   ఆర్యన్‌ క్యాపిటల్‌ అధినేత కూడా. అలాగే కర్ణాటకలోని పలు కంపెనీల్లో మోహన్‌దాస్‌ పాయ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అంత‌టి ప్ర‌ముఖ వ్య‌క్తి తాజాగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ట్వీట్‌ చేశారు. జగన్ ప్రభుత్వం పీపీఏలపై  సమీక్ష జరపడంపై మోహన్‌దాస్‌ పాయ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ...ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందని ఆయన ట్వీట్ చేశారు.


ఏపీ భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దంటూ మే నెలాఖరులో మోహన్‌ దాస్‌ పాయ్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. తాజాగా మ‌ళ్లీ పీపీఏలపై సమీక్ష జరపాలని సీఎం జగన్ నిర్ణయించడంపై ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీని దెబ్బతీసి..రాష్ట్రాన్ని కుప్పకూల్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ భవిష్యత్‌ను జగన్‌ నాశనం చేస్తున్నారన్నారని  మోహన్ దాస్ పాయ్ ధ్వజమెత్తారు. జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా కళ్లు తెరుచుకోవద్దా? అని ఆయన తన ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఇలా చేస్తే ఏపీకి పరిశ్రమలు ఎలా వస్తాయన్నారు. సింగపూర్‌ ఇప్పటికే అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని.. అలాంటి వారి నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని మోహన్‌ దాస్ పాయ్  ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన ట్వీట్‌ను నేరుగా జగన్‌కే ట్యాగ్ చేశారు. ఇదిలాఉండ‌గా, మోహ‌న్‌దాస్ పాయ్ ట్వీట్‌పై అధికార వ‌ర్గాలు, వైసీపీ నేత‌లు స్పందించలేదు.


కాగా, ఇప్ప‌టికే పీపీఏల ఒప్పందాలను సమీక్షించడాన్ని జపాన్ సర్కార్ తప్పుబట్టింది. ఏపీ సర్కార్ నిర్ణయాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా జపాన్ సర్కార్ స్పష్టం చేసింది. జపాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అంశంపై ఏపీ సీఎం జగన్ కు జపాన్ అంబాసిడర్ లేఖ రాశారు. ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయాల వల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొంటుందని జపాన్ అంబాసిడర్ అభిప్రాయపడ్డారు. ఇండియా రెన్యూవబుల్ సెక్టార్ లో విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్న తరుణంలో జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్,దక్షిణాఫ్రికా, యూరప్ కంపెనీలు టెండర్లలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే జపాన్ కంపెనీలు పలు ఒప్పందాలు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: