తెలంగాణలో ప్రతిపక్షంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ప్రజాసమస్యలపై దృష్టి పెడుతోంది. ఇదే సమయంలో ఆరోగ్య శ్రీ విషయం ఆ పార్టీకి అందివచ్చింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ విషయంలో ప్రభుత్వం హాస్పిటల్స్ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో బీజేపీ ఈ ఇష్యూని హైలెట్ చేస్తోంది. ఆసుపత్రుల యాజమాన్యాలు 1500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ 800 కోట్ల రూపాయలని చెప్పడాన్ని గుర్తు చేస్తోంది.


ఈ రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు 700 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈటెల రాజేందర్ 600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాలను తెలియజేస్తోందంటూ మండిపడుతోంది. పేదల ఆరోగ్యం తో ఆడుకుంటున్న దానికి ఇది నిదర్శనం. ధర్నా చౌక్ వద్ద ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నా చేసినప్పుడు సమస్యలు పరిష్కరించి ఉంటే ఈరోజు ఆరోగ్య శ్రీ సేవలు నిలుపుదల చేసే అవకాశం ఉండేది కాదు కదా అంటున్నా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.


ఆయన ఇంకా ఏమంటున్నారంటే...

రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణి పేద ప్రజల పాలిట శాపంగా మారుతుంది. ఆరోగ్యశ్రీ సేవలను చర్చల అనంతరం కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రతినిధులు ప్రకటించడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది అనడానికి ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడం ఒక ఉదాహరణ మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు బకాయిలు ఉన్న మాట వాస్తవం.


రాష్ట్ర ప్రభుత్వం సంపద రెండింతలు అయ్యిందని స్వాతంత్ర దినోత్సవ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సంపద పెరిగినప్పుడు బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది.మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వాతంత్రానంతరం నుండి 2014 వరకు 60 వేల కోట్లు ఉంటే అదనంగా రెండు లక్షల కోట్లు అప్పులు ఐదు సంవత్సరాలలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం విద్య విషయంలో బకాయిలు ఉండడం పేదవారిని విస్మరించడమే అవుతుంది. వెంటనే బకాయిలు చెల్లించవలసినదిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: