అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మెల్లిమెల్లిగా దారిలోకి వ‌స్తున్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య విష‌యంలో గ‌తంలో చేసిన దూకుడు ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆయ‌న ఉపసంహ‌రించుకుంటున్నారు. ద్వైపాక్షికంగానే చ‌ర్చించుకోవాలంటూ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు శ్వేత‌సౌధం ఓ ప్ర‌ట‌క‌న‌లో పేర్కొంది. ఐక్య‌రాజ్య‌స‌మితిలో శుక్ర‌వారం క‌శ్మీర్ అంశంపై 15 దేశాలు ర‌హ‌స్య స‌మావేశాన్ని నిర్వ‌హించి చ‌ర్చించగా ఈ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. 


ఐరాస భద్రతామండలి అధ్యక్షురాలు, పోలండ్‌కు చెందిన జువన్నా రోయెంకా నేతృత్వంలో భద్రతామండలి శుక్రవారం సమావేశమైంది. ఐదు శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులు, 10 ఆహ్వానిత సభ్య దేశాల ప్రతినిధులతో అంతర్గత సంప్రదింపులు (క్లోజ్డ్ డోర్ కన్సల్టేషన్స్) జరిపింది. గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సమావేశం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాగా, ఆ స‌మావేశానికి ముందే ఇమ్రాన్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. అయితే ఆ స‌మావేశం అనంత‌రం ఇమ్రాన్‌తో ట్రంప్ ఫోన్ మాట్లాడిన విష‌యాన్ని వెల్ల‌డించారు. జ‌మ్మూక‌శ్మీర్ అంశంలో త‌లెత్తిన ఉద్రిక్త‌త‌లను ఇండోపాక్ దేశాలు ద్వైపాక్షికంగానే చ‌ర్చించుకోవాల‌ని ట్రంప్ కోరిన‌ట్లు డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీ హోగ‌న్ గిడ్లే తెలిపారు. 


కాగా, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్.. దీనిపై చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేయాలని ఐరాస భద్రతామండలిని కోరింది. ఈ మేరకు భద్రతామండలి అధ్యక్షురాలు జువన్నా రోయెంకాకు పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ గతవారం లేఖరాశారు. పాక్ అభ్యర్థనకు దాని మిత్రదేశం చైనా మద్దతు పలికింది. కశ్మీర్‌పై ఐరాస భద్రతామండలిలో రహస్యంగా చర్చించాలని చైనా కూడా అధికారికంగా విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ స‌మావేశం నిర్వ‌హించారు.  జ‌మ్ముకశ్మీర్ అంశంపై చర్చలు జరుపాలంటే ముందుగా పాకిస్థాన్ తమ ప్రాంతంలోని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత అంతర్గత అంశమని, ఇందులో మరోదేశానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే జమ్ముకశ్మీర్ సమస్య పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, భారత్-పాక్ కలిసి చర్చించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: