అవకాశం దొరికితే చాలు.. ప్రత్యేక విమానాల్లో తిరగటం.. స్టార్ హోటళ్లలో బస చేయటం.. కోట్లను పప్పు బెల్లాల మాదిరి ఖర్చు చేసేయటం లాంటి పనులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది చంద్రబాబు జమానా. నాటి ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోపాలు.. తప్పులు.. ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాల్ని పున:సమీక్షించి.. ప్రజాధనం వేస్ట్ కాకుండా చేయాలన్నదే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పం. ఏం జరిగినా ఫర్లేదు.. పారిశ్రామికవేత్త ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా మాత్రం వ్యవహరించొద్దన్న సగటు ప్రభుత్వ తీరుకు భిన్నంగా.. ప్రజల సొమ్ముకు అసలు సిసలు రక్షకుడిగా వ్యవహరిస్తూ.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 


జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విభజన కారణంగా తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో.. ప్రజాసొమ్ము మరింత ప్రభావవంతంగా ఖర్చు చేయాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల్ని పున:సమీక్షిస్తోంది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా చంద్రబాబు సర్కారు చేపట్టిన అన్న క్యాంటీన్లలో భారీ ఎత్తు ఖర్చు జరిగిందని.. ఖర్చుకు.. ఒనగూరిన ప్రయోజనానికి పోలిక లేదన్న ఆరోపణ నేపథ్యంలో అన్న క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేశారు. 


పేరుకు అన్న క్యాంటీన్లు అయినా.. అందులో ఫుడ్ సప్లై చేయటం వెనుక ఒక పెద్ద సంస్థ ఉంది. అదే.. అక్షయ పాత్ర. సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తామని చెప్పే ఈ సంస్థతో అన్న క్యాంటీన్లను రన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా అన్న క్యాంటీన్లను క్లోజ్ చేసి.. మరింత ఎఫెక్టివ్ గా ఉండేలా త్వరలోనే ఆ క్యాంటీన్లను నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అక్షయ పాత్ర సహ వ్యవస్థాపకుడు కమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన మోహన్ దాస్ పాయ్ సీన్లోకి వచ్చారు. జగన్ ప్రభుత్వంపై దారుణ వ్యాఖ్యల్ని ట్వీట్ రూపంలో సంధించారు. సదరు ట్వీట్ ను ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ఖాతాకు లింక్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.


గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని పున: సమీక్ష చేయటాన్ని తప్పు పట్టిన ఆయన.. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రభుత్వ ఉగ్రవాదంతో పోల్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ తన ప్రభుత్వ ఉగ్రవాదంతో ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ట్వీట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కాపాడాలన్న సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలపై వస్తున్న వ్యతిరేకత ఇప్పుడు జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారిందన్న మాట వినిపిస్తోంది. తనకు ప్రతికూలంగా మొదలైన ఈ ప్రచారాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: