సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని చాలా సంవత్సరాల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజం చేస్తూ 2020 సంవత్సరం ప్రారంభంలో రజనీకాంత్ కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. 2020 సంక్రాంతిలోపు పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. తమిళనాడులో రాబోయే శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్ కచ్చితంగా పోటీ చేస్తాడని తెలుస్తోంది. 
 
రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించారు రజనీకాంత్. కానీ ఇంతకాలం పార్టీ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనే సందేహాలు తమిళనాడు ప్రజల్లో ఇంతకాలం ఉన్నాయి. ఇలాంటి సమయంలో రజనీకాంత్ భవిష్యత్తు కార్యాచరణ గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి.కానీ ప్రస్తుతం రాజకీయాల విషయంలో రజనీకాంత్ చాలా మారాడు. 
 
గతంలో రజనీకాంత్ కు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైనపుడు స్పందించటానికి ఎక్కువగా ఇష్టపడేవాడు కాదు.కానీ ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి స్పందిస్తున్నాడు రజినీకాంత్. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో పార్టీ పేరు, విధి విధానాలు రజనీకాంత్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. రజినీకాంత్ మిత్రుడైన కరాటే త్యాగరాజన్ వచ్చే సంవత్సరం రజినీకాంత్ పార్టీ ప్రారంభిస్తాడని తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తాడని వ్యాఖ్యలు చేసారు. 
 
మరో రెండు సంవత్సరాల్లో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టినప్పటికీ కేంద్రంలోని బీజేపీ పార్టీకి  సన్నిహితంగా ఉంటాడని తెలుస్తోంది. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కానీ రజనీకాంత్ సన్నిహితులు మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోడని పార్టీ ప్రారంభించిన తరువాత ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా రజనీకాంత్ నిర్ణయం తీసుకుంటాడని చెబుతున్నారు. .ప్రస్తుతం రజనీకాంత్ పోయెస్ గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. జయలలిత మృతికి ముందు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పోయెస్ గార్డెన్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మరలా కీలకమైన ప్రాంతం అవుతుందనే విశ్లేషణలు తెరమీదకు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: