రెండు రోజుల క్రితమే ఓ ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో దేశంలో మూడవ అత్యుత్తమ సీఎం గా జగన్ కి ర్యాంక్ వచ్చింది. జగన్ పాలన  మొదలై ఇంకా మూడు నెలలు కాలేదు కానీ బాగానే ఉందని కితాబు ఇస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్ రాయపాటి సాంబశివరావు అయితే జగన్ బాగానే పాలన చేస్తున్నారని ఓ రేంజిలో పొగిడారు. మరి జనంలో కూడా జగన్ బాగా చేస్తున్నడని, చేయగలడన్ని నమ్మకం అలాగే ఉంది.


అయితే బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కు మాత్రం జగన్ గ్రాఫ్ తగ్గుతున్నట్లుగా ఎక్కడో లెక్క తేలిందట. విశాఖలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జగన్ పరిపాలనాపరంగా మార్కులు తగ్గిపోతున్నాయని అన్నారు. జగన్ కి సరైన సలహాదారులు లేరని కూడా హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైన వాటిలో నిర్ణయాలు వేగంగా తీసుకోవడంలేదని కూడా అన్నారు.


ఏపీలో ఇసుక కొరతతో జనం అల్లాడుతూంటే జగన్ మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రజావేదిక కూల్చడానికే ప్రాముఖ్యత ఇచ్చారని విష్ణు కుమార్ రాజు అన్నారు. జగన్ కి ప్రజల ప్రధాన సమస్యల పైన శ్రద్ధ లేదనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. ఇక జగన్ విషయంలో మరొక తప్పు ఏంటంటే ఆయన కాంట్రాక్టులను రద్దు చేసుకుంటూ పోతున్నారని, అవినీతి అంటున్నారని ఎద్దేవా చేశారు.


అసలు అవినీతి ఎలా వస్తుంది, కాంట్రాక్టర్లతో రాజకీయ నాయకులు కుమ్మక్కు అవుతేనే అవినీతి చేస్తారని ఆయన కొత్త భాష్యం చెప్పారు. జగన్ నాయకులను కట్టడి చేయకుండా కాంట్రాక్టర్ల మీద పడితే అవినీతి తగ్గుతుందా అని ప్రశ్నించారు. తాను జగన్ని కలవాలనుకుంటే ఇప్పటికి 75 రోజులుగా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలెదని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబే నయం, అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేవారని రాజు గారు బాబుని తలచుకున్నారు. మొత్తానికి చూస్తే ఈ బీజేపీ నేత జగన్ని బాగానే విమర్శించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: