మెజారిటీ సీట్లు గెలుచుకుని తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పార్టీలో కొందరు నేతలు తీరు ఇబ్బందికరంగా మారిందని చర్చ నడుస్తోంది. అందులో ముఖ్యంగా గ్రేటర్ నేతల తీరుతో అధిష్టానం విసిగిపోయి ఉందని తెలుస్తోంది.  కలిసి పని చేయకపోవడం, నేతల మధ్య కోల్డ్ వార్, గ్రూపులు కట్టడం ఇవన్నీ టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. గ్రేటర్ నేతల మధ్య గలాటాలు బయటపడిన సందర్భాలు  చాలానే ఉన్నాయి.


వీరి విభేదాల కారణంగానే మొన్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గ్రేటర్ లో చావు దెబ్బ తగిలింది. గ్రేటర్ పరిధిలో ఉన్న మల్కాజిగిరి కాంగ్రెస్ గెలుచుకుంటే, సికింద్రాబాద్ బీజేపీ గెలిచింది. ఇక హైదరాబాద్ ఎప్పుడు ఎం‌ఐ‌ఎందే. అటు గ్రేటర్ శివారులో ఉన్న చేవెళ్ళ స్థానంలో కూడా స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది. పైగా ఎన్నికల ముందు బహిరంగ సభలకు జనసమీకరణ కూడా సరిగా చేయలేక అధినేత కేసీఆర్ తో చీవాట్లు కూడా తిన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన వీరి మధ్య అంతర్గత పోరు నడుస్తూనే ఉంది.


ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను నియమించిన గులాబీ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. పాత కొత్త అని తేడా లేకుండా నాయకులంతా కలిసి అనుకున్న విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని గులాబీ బాస్ ఆర్డర్లు పాస్ చేశారు. అయినా సరే సభ్యత్వ నమోదు మీద గ్రేటర్ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాని ఫలితంగానే సిటీలోని చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఇంకా పూర్తి కాలేదు. 


ఇదే గులాబీ బాస్‌కు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సరిగా చేయలేదు. ఇప్పుడు సభ్యత్వ నమోదు కూడా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర నేతల మధ్య అసలు సమన్వయం లేదని తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల తెలంగాణ భవన్ లో గ్రేటర్ నేతలతో మీటింగ్ పెట్టారు. సభ్యత్వ నమోదు నిదానంగా ఉండటంతో నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ఒకరిపై ఒకరు ఆధిపత్య ప్రదర్శించడం వల్లే ఈ సమస్య వచ్చిందని తెలుసుకుని కేటీఆర్ అలాంటి నేతల వివరాలని తీసుకుని గట్టిగా క్లాస్ పీకేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. పైగా రానున్న గ్రేటర్, మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు కోసం వీరు గ్రూపులుగా ఏర్పడి పార్టీకి తలనొప్పిగా తయారయ్యారని వీరిని లైన్ లో పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నారు. మరి చూడాలి కేటీఆర్ గ్రేటర్ నేతలనీ ఏ విధంగా దారిలో పెడతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: