కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్ విభజన తర్వాత అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్తాన్.. తన అక్కసునంతా సరిహద్దుల్లో చూపుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నిస్తోంది. పదే పదే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.


కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయాలని పాక్ కలలు కన్నది.. ఆర్టికల్ 370 రద్దును ప్రపంచమంతా చాటి.. భారత్ పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నించింది, కానీ ఒక్క చైనా మినహా ప్రపంచదేశాలేవీ కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని తప్పుబట్టలేదు. అందుకే ఆ అసనహంతోనే పాక్ సరిహద్దుల్లో తెగబడుతోంది.


ఈ కవ్వింపులో భాగంగానే.. రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టర్‌లో శనివారం పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం పాక్ ఇక్కడ కాల్పులకు పాల్పడింది. నౌషేరా సెక్టర్‌లో మోర్టారు షెల్స్‌, తుపాకులు ఉపయోగించి కాల్పులు జరిపింది. భారత్‌ కూడా ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సందీప్‌ థాపా అనే భారత జవాను మరణించారు.


ఈ సంఘటనతో భారత్ పై పైచేయి సాధించామని భావించింది. అయితే ఇందుకు అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తమ జవాను మృతికి భారత్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. రాజౌరీ సెక్టర్‌ సమీపంలో నియంత్రణ రేఖ అవతల ఉన్న ఓ పాకిస్థానీ పోస్టును భారత్ తుత్తినియలు చేసింది.


రాజోరీ జిల్లాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ దాడులు చేసిందని భారత రక్షణ శాఖ వివరించింది. భారత్ కూడా దీటుగా ఆ దాడులను తిప్పికొడుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఇరు దేశాల మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు అటు పాక్ వాసుల్లోనూ..ఇటు భారత్ వాసుల్లోనూ ఆందోళన పెంచుతున్నాయి. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: