ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్షల విధానంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పరీక్షల విధానంలో సమూల మార్పులు చేయాలని విద్యా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం 50 మార్కుల చొప్పున రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. గతంలో ప్రతి పేపర్ లో పది మార్కులకు అబ్జెక్టివ్ విధానంలో బిట్ పేపర్ ఉండేది. ప్రస్తుతం ఈ బిట్ పేపర్ రద్దు చేస్తూ ప్రభుత్వం జులై 16 వ తేదీన జీవో 41 ఇచ్చింది. 
 
పదవ పరగతి పరీక్షల్లో బిట్ పేపర్ రద్దు చేయటానికి ముఖ్య కారణం మాస్ కాపీయింగ్ అని తెలుస్తోంది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు బిట్ పేపర్ విషయలో కాపీయింగ్ కు పాల్పడుతున్నారనే విమర్శలు ఎప్పటినుండో ఉన్నాయి. అందువలన ఈ బిట్ పేపర్ విధానాన్ని రద్దు చేయబోతున్నారని తెలుస్తోంది. బిట్ పేపర్ కు బదులుగా ఒకే వాక్యంలో సమాధానాలు రాసే ప్రశ్నలను ప్రభుత్వం ఇవ్వబోతుంది. 
 
ఒకే వాక్యంలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలను ప్రత్యేకంగా కాకుండా ప్రశ్నా పత్రంతో పాటే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకుముందు హిందీ కాకుండా మిగతా సబ్జెక్టులకు ఒక్కో పేపర్ కు 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండేవి. ఇకనుండి హిందీ/సంస్కృతం తప్ప మిగతా పరీక్షలకు 40 మార్కులకు బదులుగా 50 మార్కులకు ఇవ్వనున్నారు. 
 
ప్రతి పేపర్ కు ప్రశ్నా పత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి రెండున్నర గంటల సమయం ఇవ్వనున్నారు. హిందీ/సంస్కృతం పరీక్షలకు మాత్రం పరీక్ష రాయటానికి మూడు గంటల సమయం, ప్రశ్నా పత్రం చదువుకోవటానికి 15 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. గతంలో రెండు పరీక్షలకు కలిపి 35 మార్కులు వస్తేనే విద్యార్థులు పాస్ అయ్యేవారు. కానీ ఇకనుండి ప్రతి పేపర్ లోను కనీసం 17.5 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: