ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి ఉలిక్కిపడింది. ఆ దేశ రాజధాని కాబూల్ లోని ఓ పెళ్లి వేడుక నెత్తుటి మయమైంది. శక్తివంతమైన బాంబు పేలడంతో దాదాపు 40 మందికి పైగా విగత జీవులయ్యారు. సంబరాల వేదికగా నిలవాల్సిన పెళ్లి వేడుక మారణ హోమానికి సాక్ష్యంగా నిలిచింది. సరిగ్గా పదిరోజుల క్రితం ఆగస్టు 7న భద్రతా బలగాలే లక్ష్యంగా జరిపిన కారుబాంబు దాడిలో 14మంది మృతిచెందిన ఘటనను మరువక ముందే ఈ దారుణం చోటు చేసుకుంది.


మృతుల సంఖ్యపై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటి వరకు దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఘటన జరిగిన తీరు చూస్తే.. లోకల్ ఇస్లాం టెర్రరిస్టులతో తాలిబన్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనిక బలగాలకు, తాలిబన్లకు మధ్య సయోధ్య కోసం చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగింది.


ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఈ పేలుడులో మరో 100 తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు దాదాపు 1000 మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతి పెద్దది. వివాహ వేడుకలో ఓ దుండగుడు ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడే కావచ్చని ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రహీమీ అన్నారు.


పెళ్లి వేదికపై సంగీత బృందం ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ బాంబు పేలుడు జరిగింది. అతిథులంతా సంగీత బృందం వద్ద గుమిగూడిన సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్‌ లో శాంతి నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఈ బాంబు దాడితో విఘాతం కలిగినట్టయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: