తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉగ్ర‌రూపం దాల్చారు. త‌న ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం గురించి స‌రైన రీతిలో స్పందించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యాదాద్రి దేవస్థానం పునరుద్ధరణ పనులను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం యాదాద్రిలో సుమారు తొమ్మిది గంటలపాటు గడిపారు. పునరుద్ధరణ పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌నులు జ‌ర‌గ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


శ‌నివారం ఉదయం 11.30 గంటలకు యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి 8:15 గంటల వరకు యాదాద్రిలోనే ఉండి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడుగంటలపాటు యాదాద్రి నిర్మాణాలను పరిశీలించారు. దాదాపు ఆరుగంటలపాటు పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. తొలుత యాదాద్రి చుట్టూ ప్రగతిరథంలో సుమారు 20 నిమిషాలపాటు పర్యటించారు. రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం, స్వామివారి తెప్పోత్సవం కోసం నిర్మితమవుతున్న గండి చెరువును, రింగ్‌రోడ్డు సర్కిల్, పార్కులను పరిశీలించారు. మినీబస్సులో యాదాద్రి కొండపైకి చేరుకొని బాలాలయంలో లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం ప్రధానాలయం ఉన్న ప్రాంతంలో 14.5 ఎకరాల్లో ప్రధాన పునరుద్ధరణ పనులను పరిశీలించారు.


ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకో ఐదేళ్లు ప‌నులు చేస్తున్నారా? అంటూ మండిప‌డ్డారు. ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణంలోనూ, గుడి అంతర్గత పనుల్లోనూ జాప్యం జరుగుతున్నదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. నిధుల కొరతతో పనుల్లో వేగం తగ్గుతుందంటే సహించనని, పెండింగులో ఉన్న బిల్లులకు తక్షణమే రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. దీనిపై ఉత్తర్వులివ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని అప్పటికప్పుడే ఆదేశించారు. జరిగిన పనులకు రూ.473 కోట్లు మంజూరు చేయాలని యాడా అధికారులు ప్రతిపాదనలను పంపగా.. వాటిని సైతం త్వరలోనే విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: