అత్యంత భారీగా 151 సీట్లు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పాలన వ్యవహారాల్లో దూకుడు ప్రదర్శిస్తూనే...పార్టీ కోసం కష్టపడిన నేతలకు తగిన ఫలితం అందేలా కూడా చేస్తున్నారు. ఇప్పటికే కీలక ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అప్పగించిన జగన్...మరికొందరికి నామినేటెడ్, దేవాలయాల చైర్మన్ పోస్టులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ముగ్గురు నేతలకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు.


మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు, హిందూపురంలో బాలయ్య మీద ఓడిపోయిన ఇక్బాల్ లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే ఎన్నికల ముందు వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్ వెంట నడిచిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి మాత్రం దక్కలేదు. జగన్ నమ్మిన బంటుగా ఉన్న ఆయనకి పదవి దక్కకపోవడంపై అనుచరులు కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే విశ్వేశ్వర్ రెడ్డికి అంగబలం గానీ, అర్ధబలం గానీ పెద్దగా లేకపోయిన పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు.


గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని పార్టీలోకి లాగేసుకున్నారు. ఇంకా చాలమందిపైన వల వేశారు కూడా. అందులో అప్పుడు ఎమ్మెల్యేగా విశ్వేశ్వర్ కూడా ఉన్నారు. ఆయన టీడీపీ లాబీయింగ్ కి తలొగ్గకుండా నమ్ముకున్న పార్టీ కోసం ఇబ్బందులు ఎదురైన అలాగే ఉండిపోయారు. టీడీపీలోకి వెళ్లకుండా వైసీపీలోనే ఉన్నారు. దీంతో జగన్ మొన్న ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డిని మరోసారి ఉరవకొండ బరిలో దింపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన ఉరవకొండ వైసీపీలో గ్రూపు తగాదాలు వాళ్ళు ఆయన స్వల్ప మెజారిటీతో పయ్యావుల కేశవ్ పై ఓడిపోయారు.


ఓడిపోయినా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని అంతా అనుకున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన రోజా, చెవిరెడ్డి లాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఓడిపోయిన మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. ఎన్నికలు ముందు వైసీపీలోకి వచ్చిన చల్లాకి ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ మొదట నుంచి పార్టీ కోసం కష్టపడ్డ విశ్వేశ్వర్ రెడ్డికి ఏ పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన అనుచరులు అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రానున్న రోజుల్లో విశ్వేశ్వర్ కి మంచి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మరి చూడాలి నమ్మిన బంటుకి జగన్ ఏ విధంగా న్యాయం చేస్తారో?
 


మరింత సమాచారం తెలుసుకోండి: