ఏపీలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం సాక్షి దినపత్రికకు కలిసొచ్చింది. గత ఎనిమిదేళ్లుగా పాఠకులని కోల్పోతూ వస్తున్న సాక్షి... వైసీపీ అధికారం దక్కించుకోగానే రికార్డు స్థాయిలో రీడర్లని పెంచుకుంది. అయితే ఆన్ లైన్ న్యూస్ పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా అన్నీ దినపత్రికలకు రీడర్లు పడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇండియన్ రీడర్ షిప్ సర్వే రెండో త్రైమాసిక ఫలితాల్లో.. సాక్షి పత్రిక ఒక్కటే పాఠకులను పెంచుకుంది.


ఇండియన్ రీడర్ షిప్ సర్వే తాజాగా దినపత్రికలకు సంబంధించిన రీడర్ల వివరాలని తాజా వెల్లడించింది. 2019 రెండో త్రైమాసికంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు పాఠకులని కోల్పోయి...సాక్షి పాఠకులని పెంచుకుంది. అయితే ఎప్పటిలానే ఈనాడు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ..పాఠకుల సంఖ్యని మాత్రం కోల్పోయింది. ఏపీలో మొదటి త్రైమాసికంతో పోల్చుకుంటే రెండో త్రైమాసికంలో 7 లక్షల పాఠకులని కోల్పోయి ఈనాడు మొత్తం 72 లక్షల 43 వేల మంది పాఠకులకు పడిపోయింది. 


సాక్షి లక్ష 25 వేల రీడర్లని పెంచుకుని 53 లక్షల 70 వేలకు చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రజ్యోతి లక్షన్నర మంది పాఠకులని కోల్పోయి 36 లక్షల 28 వేల వద్ద తేలింది. అయితే తెలంగాణలో అన్నీ పత్రికలు పాఠకులని కోల్పోయాయి. ఇండియన్ రీడర్ షిప్ సర్వే ప్రకారం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 30 వేల రీడర్లని కోల్పోయి 67 లక్షల 3 వేల మంది పాఠకులతో ఈనాడు అగ్రస్థానంలో ఉంది. 


అటు సాక్షి 20 వేల మందిని కోల్పోయి 32 లక్షల 28 వేల మందితో రెండో స్థానంలో ఉంది. ఇక నమస్తే తెలంగాణ 10 వేల మందిని కోల్పోయి 28 లక్షల రీడర్లతో మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రజ్యోతి కూడా 10 వేల మందిని కోల్పోయి 22 లక్షల మంది పాఠకులతో నాలుగో స్థానంలో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: