పుట్టిన చోటనే మరణిస్తే కాశీలో చనిపోయినంత పుణ్య‌మని ఆధ్యాత్మికపరులు నమ్ముతారు. మరి రాజకీయాల్లోనూ ఆ సూత్రం వర్తిస్తే మాత్రం టీడీపీ పతనం అన్నది చాలా గొప్ప మహా ప్రస్థానం అనుకోవాలి. అది ఎవరికో కానీ దక్కని అరుదైన వరం. దాన్ని ప్రసాదించినవారు ప్రస్తుత పార్టీ అధిపతులే. మొత్తానికి ఏదైతేనేం తెలంగాణాలో టీడీపీ కధ సమాప్తం అయిపోయింది.


అదీ చంద్రబాబు అక్కడ ఉండగానే ఉన్న గుప్పెడి మంది పార్టీ నేతలు కూడా కమలం కండువా కప్పుకుని ఖుషీ చేశారు బీజేపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిపోయారు.  హైదరాబాద్ లో బీజేపీ సభలో మాజీ తమ్ముళ్ళు  చేసిన ప్రసంగాలు టీవీలో చూస్తూ చంద్రబాబు కూడా రిలీఫ్ ఫీల్ అయి ఉంటారేమో. ఓ భారం తగ్గిపోయినట్లుగా భావిస్తారేమో. నిజానికి 2009 నుంచి టీడీపీ పట్టుని తెలంగాణలో  జార్చేసిన చంద్రబాబుకు పదేళ్ల పాటు ఇంకా పార్టీ బతికి ఉండడమే ఓ ఆశ్చర్యం. అయితే పునాది అక్కడిదే కాబట్టి పార్టీ జెండా అలా రెపరెపలాడింది మరి.


టీడీపీ తెలంగాణా గడ్డ మీద 1982 మార్చి 29న పుట్టింది. నాడు సినీ లోకం నుంచి దిగివచ్చిన వెండితెర వేలుపు అన్న నందమూరి తెలుగుదేశం పార్టీని ప్రకటించింది హైదరాబాద్ నడిబొడ్డున. పచ్చి సమైక్యవాది అయిన అన్న గారిని ఆదరించిన జనం బ్రహ్మరధం పట్టారు. తెలంగాణాలో ఎపుడూ టీడీపీ రధం ఆగలేదు. అది అన్న ఎన్టీయార్ గొప్పదనం. ఆయన సైతం తెలంగాణా రూపురేఖలను మార్చేసి బడుగులకు పెద్ద పీట వేశారు.


అలా జనంతో గట్టి బంధం వేసుకున్న నందమూరి చనిపోయాక చంద్రబాబు జమానాలో పార్టీ అలా దిగనారుతూ వచ్చింది. ఇక 2019 ఎన్నికల నాటికి బాబు దర్శకత్వంలో తాను ద్వేషించిన కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకుని పునాది రాళ్లను పెకిలించేసుకుంది. దాంతో ఇపుడు టీడీపీకి అక్కడ కొత్తగా మిగిలింది లేదు. తెలంగాణాలో బలపడాలని చూస్తున్న బీజేపీలోకి పసుపు తమ్ముళ్ళు దాదాపుగా చేరిపోయారు. అంతకు ముందే బలమైన నాయకులను టీయారెస్ ఏరేసింది. ఇపుడు తెలంగాణాలో టీడీపీ అంటే గత వైభవం మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: