భారతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. వాహన విక్రయాలు లేక ఆటోమొబైల్ రంగం వెలవెలబోతోంది. ఇండ్ల అమ్మకాలు జరుగక నిర్మాణ రంగం నిరాశలో కూరుకుపోతోంది. వ్యాపారం కరువై ఎఫ్‌ఎంసీజీ రంగం కుదేలవుతుంటే.. బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిలు, బ్యాంకింగేతర రంగాన్ని నగదు కొరత వేధిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్రం ఆశయం పెట్టుకుంది. అయితే, కేంద్రం ఆశ‌యం గురించి నిపుణులు వివిధ ర‌కాల విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. 


ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండేందుకు ప‌లు కీల‌క అంశాలు ఉంటాయి. వ్య‌వ‌స్థ‌కు జీవనాడిగా ఉన్న వినియోగదారుడి కొనుగోలు శక్తి బలంగా ఉండాల్సిందే. ఇది ఎంత బలంగా ఉంటే అంతగా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. అన్ని రంగాలు ప్రకాశవంతంగా పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం భారత జీవనాడికి జబ్బు చేసింది. దాని ప్రభావమే జీడీపీ మందగమనం. కీలక రంగాలు కోలుకోవాలంటే.. కొనుగోలు శక్తి పుంజుకోవాలి. ఇప్పుడదే మోదీ సర్కారుకు పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది. అందుకే ఈ ప్రతికూల పరిస్థితులు.. భయానక వాతావరణం. ప్ర‌ధానంగా, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మందగమన పరిస్థితులు ఈ రంగానికి ప్రధాన సమస్యగా మారాయి. గ్రామీణ ప్రజలకున్న నగదు కొరత వినీమయ సామర్థ్యాన్ని భారీగా దెబ్బ తీసింది. పట్టణ, నగర ప్రాంతాల్లోనూ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యునీలివర్ వృద్ధిరేటు నిరుడు ఏప్రిల్-జూన్‌తో పోల్చితే ఈసారి 12 శాతం నుంచి 5.5 శాతానికి దిగజారింది. 


మ‌రోవైపు, దాదాపు 250 అనుబంధ పరిశ్రమలకు మూలాధారమైన నిర్మాణ రంగంలో నెలకొన్న నిస్తేజం...జీడీపీని పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తోంది. ఇటుకలు, సిమెంట్, ఉక్కు, ఫర్నీచర్, ఎలక్ట్రికల్, రంగులు తదితర ఎన్నో రంగాలు ఇండ్ల అమ్మకాలు లేక కుదేలయ్యాయి. చివరకు బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల రుణ వృద్ధిరేటూ దెబ్బ తింది. 42 నెలలుగా అమ్ముడుపోని ఇండ్లు, ఫ్లాట్లు ఉన్నాయంటే భారతీయ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


ఓవైపు అమ్మకాలు లేకపోవడం.. మరోవైపు ఉత్పత్తి నిలిచిపోవడంతో దేశీయ ఆటో ప‌రిశ్ర‌మ‌లోని పది లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఒక్క ఆటో రంగ సంస్థల్లోనే 2.30 లక్షల ఉద్యోగాలు పోతున్నాయని, ఆటో కంపోనెంట్, ఇతర అనుబంధ రంగాలను కలుపుకుంటే తొలగింపులు నాలుగు రెట్లు పెరుగుతున్నాయని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియా  చెప్పింది. టూవీలర్లు, కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు పడిపోవడం వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా 300 డీలర్‌షిప్‌లు మూతబడ్డాయని సియామ్ తెలియజేసింది. దేశీయ ప్రతికూల పరిస్థితులకుతోడు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ వంటి అంశాలు ఆటో రంగ ప్రగతిని మింగేశాయని అభిప్రాయపడింది. సేల్స్, మార్కెటింగ్ సిబ్బందితోపాటు తాత్కాలిక ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 


అయితే, భార‌త్‌ను వేధిస్తున్న ప‌రిష్క‌రించేందుకు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆర్థిక చేయూతనందించి.. ప్రభుత్వం అనవసరపు వ్యయాలను తగ్గించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా జీడీపీ గాడిలో పడాలంటే ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందాలని సూచిస్తున్నారు. ఆటో, నిర్మాణ రంగాలకూ ఉద్దీపనలు ప్రకటిస్తే కొంత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, పెట్టుబడులకు ఊతమివ్వాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: