బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డి, యూత్‌లో మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వైసీపీ లీడ‌ర్‌ల‌లో ఒక‌రు. ఇప్పుడు ఈ పేరు కేంద్రంగా రాయ‌ల‌సీమ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు నందికొట్కూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో కేవ‌లం బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, గౌరు వెంక‌ట‌రెడ్డిల మాట శాస‌నంగా ఉండేది. అంతేకాకుండా ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇద్ద‌రూ చేతులు కూడా క‌లిపారు. ఇలా మాటే శాస‌నంగా ఉన్న వీరిద్ద‌రు చేతులు క‌ల‌ప‌డంతో విజ‌యం వారి సొంత‌మేన‌ని అంద‌రూ భావించారు.కానీ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఎంట్రీతో ఆ సీన్ కాస్త రివ‌ర్స్ అయింది.


విజ‌యం వైసీపీ సొంత‌మైంది. 25 ఏళ్ల బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి వయ‌సులో చిన్న‌వాడే అయినా... రాజ‌కీయ వ్యూహాల్లో సీనియ‌ర్‌నేన‌ని వైసీపీ గెలుపుతో చెప్ప‌కనే చెప్పాడు. నందికొట్కూరులో పాజిటివ్ వైబ్రేష‌న్స్‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంతో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పూర్తి స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. తాను రాజ‌కీయాలు చేసేందుకు రాలేద‌ని, నందికొట్కూరు ఎస్సీ రిజ‌ర్డ్వ్ క‌నుక తాను పోటీచేసే అవ‌కాశ‌మే లేదంటూ యూత్‌లో త‌నపై న‌మ్మ‌కాన్ని క‌లిగించాడు.ఇలా నందికొట్కూరులో వైసీపీ గెలుపే ల‌క్ష్యంగా కృషి చేసిన బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిపై పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సైతం త‌న మ‌నసులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.


బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిని గుండెల్లోపెట్టుకుని చూసుకుంటాన‌ని, రాజ‌కీయంగా సిద్ధార్థ్‌రెడ్డిని పైకి తీసుకొస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇలా జ‌గ‌న్, బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ప్ర‌చారాల‌తో నందికొట్కూరు ఎమ్మెల్యేగా వైసీపీ అభ్య‌ర్ధి ఆర్థ‌ర్ 40 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడిన మాట‌ల‌ను పాయింట్ చేసిన ప‌లువురు  క‌ర్నూలు జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంక్ చైర్మ‌న్ ప‌ద‌విని బైరెడ్డికి ఇవ్వ‌బోతున్నార‌న్న ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. మ‌రోప‌క్క, ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: