కృష్ణానదికి వరదలు పోటెత్తాయి.. ఎగువ నుంచి వస్తున్న అఖండ జల ప్రవాహంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దాదాపు పదేళ్ల తర్వాత కృష్ణా లంకలు నీట మునిగాయి. విజయవాడ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంతో పాటు అనేక భవనాలు నీట మునిగే పరిస్థితి వచ్చింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లోని వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి.. సామాను కాపాడుకోలేక..ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.


ఈ కృష్ణా వరదలకు సంబంధించిన కవరేజ్ మీడియా బాగానే ఇస్తోంది. బాధితుల ఆవేదనకు అద్దం పడుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీడియా ఎక్కువగా ఇలాంటి వరద కష్టాలనే చూపిస్తూ వస్తోంది. ఇది మీడియా సహజ లక్షణం.. కొన్ని దశాబ్దాలుగా మనకు ఇలా చూపడమే అలవాటైంది. ఇలా చూపించడం కారణంగా ఆయా ప్రాంతాలకు మరింత ప్రభుత్వ సాయం అందే అవకాశం ఉంది. అంతవరకూ ఇది చాలా మంచి పనిగానే చెప్పుకోవాలి.


ఇక్కడ ఇంకో విషయం ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మీడియా మరచిపోతోంది. కృష్ణా వరదల కారణంగా నాగార్జున సాగర్ దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిగా నిండింది. శ్రీశైలం రిజర్వాయర్ కళకళలాడుతోంది. రాష్ట్రంలో నీటికి ఇప్పట్లో ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. దీంతో వ్యవసాయానికి చాలా వరకూ ఇబ్బందులు తొలగిపోయాయి.


రాష్ట్రంలో చాలా కాలం తర్వాత రాష్ట్రమంతా పంటలు సాగు చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటివరకూ ఎండిన పొలాలు ఇప్పుడు పచ్చబారే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు నిరంతరాయంగా వెళ్తోంది. జలాశయాలు నింపుకునే అవకాశం వచ్చింది. నిన్నటి వరకూ దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు మళ్లీ రీచార్జ్ అవుతున్నాయి. ఇలా వరదముంపు ప్రాంతాలు తప్పిస్తే రాష్ట్రమంతటా ఇప్పుడు ఆనంద దృశ్యం కనిపిస్తోంది. ఇదో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఓ శుభ పరిణామంగానే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: