పోలవరం ప్రాజెక్ట్ ఏ ముహూర్తాన పునాదిరాయి వేశారో కానీ ఇప్పటికి ఎనభయ్యేళ్ళు గడుస్తున్నా అది కార్యరూపం దాల్చడంలేదు. పోలవరం కోసం కలలు కన్న వారు అంతా కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపొయారు. పోలవరం కోసం ఎంతో శ్రమకోర్చిన వారు కూడా కాలగర్భంలో కలసిపొయారు. పోలవరం అన్నది పాలకున నోట ప‌డికట్టు మాటగా మారింది. అది ఎపుడు పూర్తి అవుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి  ఉంది.


చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నారని ఏకంగా ప్రధాని స్థాయి వ్యక్తి అన్నారంటేనే ఈ ప్రాజెక్ట్ మీద పాలకులకు శ్రధ్ధ ఏపాటి ఉందో అర్ధమవుతుంది. అయిదేళ్ళ పాటు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలించారు. ఆయన ఏలుబడిలో పోలవరం రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు అనే విధంగా సాగింది. పోలవరం పనుల కంటే అవినీతి బాగా పెరిగిందని బాబు టైంలో ఉండవల్లి వంటి రాజకీయ సీనియర్లు విమర్శలు చేసిన సంగతి విధితమే. 


అతి పెద్ద పోలవరం ప్రాజెక్ట్ కు నామినేషన్ పధ్ధతిలో టెండర్లను ఖరారు చేయడం వెనక కూడా కమిష‌న్ల కధ ఉందని అంటారు. ఇక ఏపీలో  జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూనే రివర్స్ టెండరింగ్ అనే కొత్త పదాన్ని తీసుకువచ్చారు. దాంతో పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు ఇపుడు అదే విధానాన్ని వర్తింపచేస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలవరం టెండర్లను నవయుగకు రద్దు చేశారు.


కొత్తగా రీ టెండరింగ్ కి ఇన్వైట్  చేస్తున్నారు. దీంతో పోలవరం కధ మళ్ళీ మొదటికి వస్తుందని అంటున్నారు. పోలవరం రీ టెండరింగ్ పనులు పూర్తి అయి ప్రాజెక్ట్ పనులు మొదలు కావాలంటే పుణ్యకాలాలు గడిచిపోతాయని కూడా నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టాలంటే తగిన ఎక్విప్మెంట్ తో సిధ్ధమయ్యే కాంట్రాక్టుదారులు ముందుకు రావాలి. నవయుగ వద్ద తగిన ఎక్విప్మెంట్ ఇపుడు రెడీ గా ఉంది.


ఇక జ్యూడీషియల్ పరిశీలన జరిగితేనే తప్ప ఈ టెండర్లు ఆమోదం కావని ప్రభుత్వం అంటోంది. దానికి కూడా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు కేంద్రం కూడా రివర్స్ టెండరింగ్ వద్దు అంటోంది. దానికి విరుద్ధంగా వైసీపీ సర్కార్ విధానాలు ఉన్నాయి. దీంతో ఏదో వంక చూపించి కేంద్రం కొర్రి పెడితే పోలవరం శాశ్వతంగా పడక వేస్తుదన్న భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే పోలవరం కష్టల్లో పడిందని అంతా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: