రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అన‌తి కాలంలోనే ఫేడౌట్ అయిన నేత‌ల్లో బుట్టా రేణుక ఒక‌రు. పొలిటిక‌ల్ ఎంట్రీతోనే వైసీపీ ఎంపీ టికెట్ ద‌క్కించుకుంది. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీగా విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. ఆ త‌రువాత ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక సైకిల్ ఎక్కిన నాటి నుంచి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాలు ప్రతి ఒక్క‌రికి తెలిసిందే.టీడీపీలో ఎంపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వ‌ర‌కు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి, చివ‌ర‌కు హ్యాండ్ ఇవ్వ‌డంతో ఈ ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ళ్లీ ఫ్యాన్ గూటికి చేరుకున్నారు.


అయితే ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైసీపీ ఘ‌న విజ‌యం సాధించినా బుట్టా రేణుకకు మాత్రం పూర్వ వైభ‌వం సాధించ‌లేక‌పోయింది. దీంతో ఆమె గ‌తాన్ని గుర్తుకు తెచ్చుకుని తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ని అనుచ‌ర‌వ‌ర్గం చెప్పుకొస్తుంది.నిజానికి గ‌తంలో బుట్టా రేణుక‌కు వైసీపీని వీడాల‌ని లేకున్నా.., కేవ‌లం కుటుంబ స‌భ్యుల ఒత్తిడి కార‌ణంగానే ఆమె టీడీపీలో చేరాల్సి వ‌చ్చింద‌ని అనుచ‌ర‌వ‌ర్గం చెబుతోంది. అంతేకాకుండా కుటుంబ స‌భ్యులు చెప్పిన మాట‌లు విన‌డం కార‌ణంగా త‌న పొలిటిక‌ల్ గ్రాఫ్ అమాంతం ప‌డిపోతుంద‌ని ఊహించ‌లేద‌ని బుట్టా రేణుక చెబుతోంద‌ట‌.అయితే, చివ‌రి నిమిషంలో జ‌గ‌న్ చెంత‌కు మ‌ళ్లీ చేరినా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల‌ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. అటువంటి ఆమె ప్ర‌స్తుతం త‌న వ్యాపార సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌పై పూర్తి దృష్టి సారించారు.


రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా... పార్ల‌మెంట్‌లో 22 మంది ఎంపీలు ఉన్నా.., బుట్టా రేణుక త‌న‌కు పలాన ప‌ద‌వి కావాల‌ని సీఎం జ‌గ‌న్‌ను గ‌ట్టిగా అడ‌గ‌లేక‌పోతున్నార‌ట‌. వైసీపీని వీడి టీడీపీలో చేర‌డం.., మ‌ళ్లీ అన్‌కండీష‌న‌ల్‌గా వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డం వంటి పరిణామాలే అందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఆమె అనుచ‌ర‌వ‌ర్గం పేర్కొంటుంది. కానీ బుట్టా రేణుక మాత్రం త‌న‌పై సీఎం జ‌గ‌న్‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంద‌ని, ఆ న‌మ్మ‌క‌మే త‌న‌కు ఎమ్మెల్సీ కానీ, రాజ్య‌స‌భ కానీ తెచ్చిపెడుతుంద‌న్న హోప్‌తో ఆమె ఉన్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: