ఇటీవలే విడుదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు విదించే శిక్షలకు పెద్ద పెద్ద వాళ్ళే భయపడుతున్నారు. కానీ మద్యం మత్తులో మైనర్ లు చేసిన తప్పుకి మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అడిగిందల్లా ఇచ్చి పిల్లల్ని గారాబంగా పెంచటం వలన ఫలితం అభం శుభం తెలియని వాళ్లు బలి కావలసి వచ్చింది. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.


హైదరాబాద్ పంజగుట్టలో రమ్య అనే చిన్నారి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తరహాలోనే మరొకటి జరగడం ఇప్పుడు కలకలం రేపుతుంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఆటోను ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు పద్నాలుగు నెలల బాలుడు మరణించాడు. కూకట్ పల్లికి చెందిన సంధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో యాప్రాల్ లో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లి డైరీ ఫామ్ హౌజ్ మలుపు దగ్గర కారు రాంగ్ రూట్ లో వచ్చి ఆటోను ఢీకొట్టింది.


ఆటోలో ప్రయాణిస్తున్న పద్నాలుగు నెలల మహదేవ్ తో పాటు అతడి అమ్మమ్మ నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతులతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మైనర్ లు మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. మద్యం మత్తులో ఉన్న మైనర్ లు రాంగ్ రూట్ లో వచ్చి ఆటోను ఢీకొట్టారు. ప్రమాదంలో సంధ్యతో పాటు ఆమె మరో కుమారుడు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మైనర్ యాక్సిడెంట్ చేసిన కారుని పరిశీలిచారు.


కార్ లో మద్యం బాటిల్లు లభించడంతో తాగి వాహనం నడిపినట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన మైనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్యక్ష సాక్షులు కోరారు. ఆటోను ఢీ కొట్టిన తరువాత కారు కొంత దూరం వరకు ఆటను ఈడ్చుకెళ్లింది. దీంతో కారు, ఆటో నుజ్జునుజ్జయ్యాయి. మరో రెండు బైకులు కూడా ప్రమాదానికి గురవ్వగా ఇద్దరు గాయపడ్డారు. మద్యం మత్తులో మైనర్ లు బీభత్సం సృష్టించడంతో అయిదుగురు గాయపడ్డారు. డెయిరీఫామ్ దగ్గర జరిగిన ప్రమాదంపై బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలి అంటున్నారు. కార్ ప్రమాదం చేసిన మైనర్ హాసన్ తో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.వారు దొరకిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: