నెక్స్ట్ టార్గెట్ ఎవరు...? విశాఖ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ బిల్డింగ్ కూల్చేసిన జీవీఎంసీ ....మాజీ మంత్రి గంటాశ్రీనివాస్ క్యాంప్ కార్యాలయానికి నోటీసులు పంపింది.  మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిళ్ళతో రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని టీడీపీ ఆరోపించడంతో కూల్చివేతల వ్యవహారానికి  పొలిటికల్ టచ్ వచ్చింది.


అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ దూకుడు పెంచింది. జయభేరి షెడ్డు తొలగింపు....టీడీపీ ఆఫీస్ కు నోటీసులు...మాజీ ఎమ్మెల్యే బిల్డింగ్ కూల్చివేత...మాజీ మంత్రి గంటా విడిది కార్యాలయాలకు నోటీసులతో షాక్ మీద షాక్ ఇస్తోంది.అక్రమ నిర్మాణాలు ఎవరివైనా ఉపేక్షించబోమని జీవీఎంసీ హెచ్చరిస్తుంటే.....రాజకీయ కక్ష సాధింపేనని ప్రతిపక్షం మండిపడుతోంది. దీంతో విశాఖ నగరంలో కూల్చివేతల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. 


నగరంలో నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాల సంఖ్య పదివేల వరకూ వుంటుందని గ్రేటర్ విశాఖ అంచనా వేసింది. వీటిని బీపీఎస్ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరించుకునేందుకు ఈనెలాఖరు వరకూ అవకాశం ఉంది. ఐతే, బీపీఎస్ తిరస్కరణకు గురైన భవనాలను జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. ద్వారకానగర్ మెయిన్ రోడ్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ సత్యన్నారాయణకు చెందిన ఐదు అంతస్థుల భవనం కూల్చివేత రాజకీయంగా చర్చనీయాంశమైంది. జీవీఎంసీ 13వ వార్డు సర్వే నెంబరు 32/2లో పీలా గోవింద సత్యనారాయణ భార్య విజయలక్ష్మి పేరిట ఆరంతస్తుల భవన నిర్మాణాన్ని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరగడం....అతిక్రమణలు చోటు చేసుకోవడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ శాసనసభ్యుడు కావడంతో కఠిన చర్యలకు అధికారులు వెనుకాడారు. ప్రభుత్వం మారిన తరుణంలో మాజీఎమ్మెల్యే పీలా....బీపీఎస్ కోసం దరఖాస్తు చేయగా...అది తిరస్కరణకు గురైంది. దీంతో బిల్డింగ్ కూల్చివేతను జీవీఎంసీ చేపట్టగా....కోర్టును ఆశ్రయించి నిలుపుదల చేయించుకున్నారు పీలా.


ఈ వ్యవహారం నలుగుతుండగానే గ్రేటర్ అధికారులు మరో షాక్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల జాబితాలోమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోసం భీమిలి బీచ్‌ రోడ్డులో నిర్మించిన భవనం చేరింది. క్యాంప్ కార్యాలయానికి  ఎలాంటి అనుమతుల్లేవని భీమిలి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నోటీసు జారీ చేశారు. భవనానికి తాళాలు వేసి ఉండటంతో తలుపులకు నోటీసు అతికించామని  ఆధారాలు ఉన్నట్లయితే తమ వద్దకు తేవాలని అందులో కోరారు.ఈ పరిణామాలు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని....మంత్రి అవంతి ఒత్తిళ్ళతోనే జరుగుతున్నయని టీడీపీ ఆరోపిస్తోంది. 


కొద్దిరోజుల క్రితం ఎంవిపి కాలనీలోని జయభేరి ట్రూ వేల్యూ కు చెందిన తాత్కాలిక నిర్మాణాన్ని తొలగించారు. దస్పల్లాహిల్స్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు నోటీసులు పంపారు. ఈ బిల్డింగ్ నిర్మాణం అక్రమమని తెల్చిన అధికారులు....లీజు ఒప్పందానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధమని తేల్చడంతో టీడీపీ వర్గాలు కలవరపడ్డాయి. పార్టీ కార్యాలయానికి అన్ని అనుమతులు వున్నాయని....వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని టీడీపీ నాయకత్వం విమర్శలు గుప్పించింది. అధిష్టానం ఆదేశం మేరకు జీవీఎంసీ కమిషనర్ ను కలిసి తమ వాదనను వినిపించారు. 2002లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించినట్టు రికార్డులను చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్ వివాదం ....జీవీఎంసీ కమిషనర్ సృజన పరిశీలనలో వుంది.టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణమని తేలితే చర్యలకు వెనుకాడరనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: