శ్రీకాకుళం జిల్లాలోని మన్యం ప్రాంతం లో దాదాపు తొమ్మిది మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాల్లో వివిధ తెగలను సర్కార్ ఎస్టీలుగా గుర్తించారు. వారిలో ఏనేటి కోన్స్ తెగకు చెందిన వారు దాదాపు మూడు వేల మందికి పైగా ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రెండు వేల ఆరు వరకూ ఏనేటి తెగ ఎస్టీ గానే పరిగణింపబడింది. ఆ తరవాత నుండి వారికి కష్టాలు మొదలయ్యాయి. రెండు వేల తొమ్మిది నుండి వారికి పూర్తిగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చెయ్యటం నిలిపివేశారు. దీంతో సరైన చదువులు లేక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఇప్పుడు దీని మీద వీరు పోరాటం చేస్తున్నారు. గతంలో ఉన్న తమ హోదాను తిరిగి తమకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ సంపద మీదనే ఆధారపడ్డ తమను ఇలా చిన్న చూపు చూడటం తగదంటున్నారు. మిగతావారిలాగా తమకు కొత్తగా రిజర్వేషన్ కావాలని అడగటం లేదని ఉన్నదాన్నే పునరుద్ధరించమని వేడుకుంటున్నామని అంటున్నారు.  ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి. కానీ తమకు మాత్రం అవి అందని ద్రాక్షగానే ఉండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఎక్కడకు వెళ్లినా ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకున్న మీ కులం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని ఏనేటి కోన్స్ తెగస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రం కోసం వెళితే మీరు ఏ కులానికి చెందిన వారు కాదని చెబుతున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీంతో పిల్లల్ని చదువు మాన్పించి కూలి పనులకు పంపుకోవాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయని అంటున్నారు. ఇది ఇప్పటి సమస్య కాదు, పదమూడు సంవత్సరాలుగా వారు పడుతున్న మనోవేదన. తీరని సమస్యగానే ఉండిపోతుంది. వారి పట్ల జాలి చూపుతున్నారే కానీ చర్యలు మాత్రం తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సర్కారు తమకిచ్చిన అవకాశం ఎందుకిలా మారింది ఎవరూ దీన్ని మార్చారు వారికి ఇవేవీ తెలియవు. కానీ తమకు నష్టం జరుగుతున్నది మాత్రమే గ్రహిస్తున్నారు. కనిపించిన ప్రతివారిని వేడుకుంటున్నారు. ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.


ఆ నమ్మకమే వారిని శాంతంగా ఉంచుతుంది. ఉద్యోగాల నోటిఫికేషన్ లు వెలువడుతూనే ఉన్నాయి. కానీ అవేమి వారికి లభించడం లేదు. నిన్న మొన్నటి వరకు ఉన్నత చదువులు వారిని ఎంతగానో ఊరించాయి. కానీ ఇప్పుడు అందని ద్రాక్ష గానే మారింది. వ్యవసాయం మీద వచ్చేదే అంతంత మాత్రం సరైన కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు ఉన్న హోదాను తీసే సరికి తమ బతుకులు అగమ్యగోచరంగా మారాయని వారు వాపోతున్నారు. స్కాలర్ షిప్ లు రాక, ఫీజ్ రీయంబర్స్ మెంట్ అర్హత లేక, పై చదువులకు వెళ్లలేక పోతున్నాం అన్న బాధ వారి మాటల్లో కనిపిస్తుంది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులతో పాటు మంత్రులకు వివరించామని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. పదమూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా ఇప్పటి వరకు తమ అతీగతి ఎవరూ పట్టించుకోలేదని ఏనేటి కోన్స్ తెగవారు అంటున్నారు. గత విధానాన్ని తమకు కేటాయించకపోతే పూర్తిగా వెనుకబాటుకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని వారంటున్నారు. వీరు చేస్తున్న పోరాటానికి కొన్ని సామాజిక వర్గాలు మద్దతు ప్రకటించాయి. ఇల్లంటి పరిస్తితుల నుంచి ప్రభుత్వంమే కాపాడాలని వారు ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: