అన్నా క్యాంటీన్ల మూసివేత నిర్ణయం పట్ల  వెల్లువెత్తుతోన్న వ్యతిరేకతను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు  చర్యలు చేపట్టారు . జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్ల స్థానంలో వైయస్సార్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా  క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు  అన్నా క్యాంటీన్లను ఇది వరకు  నిర్వహించిన  అక్షయపాత్ర  ఫౌండేషన్  ప్రతినిధులకు  ప్రభుత్వ వర్గాలు నుంచి  సమాచారం అందినట్లు తెలుస్తోంది.  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 31వతేదీ అర్ధరాత్రి ను  నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన విషయం తెలిసిందే. 


అన్నా క్యాంటీన్లను  మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని   అల్పాదాయ,  మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . అన్నాక్యాంటీన్లలో  ఐదు రూపాయలకే ఉదయం వేళల్లో  అల్పాహారం, మధ్యాహ్న ... రాత్రిపూట భోజనం అందించారు . దీనితో అల్పాదాయ , మధ్యతరగతి వర్గాల ప్రజలు , కార్మికులు , నిరుద్యోగులు ఈ క్యాంటిన్లలోనే భుజిస్తూ తమ ఆకలిని తీర్చుకునేవారు . అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున అవినీతి , అక్రమాలు చోటుచేసుకున్నాయని మూసివేయాలని నిర్ణయించింది . ప్రభుత్వ ఈ నిర్ణయం అన్నా క్యాంటీన్లపై ఆధారపడి తమ ఆకలిని తీర్చుకుంటున్న వర్గాలకు శరాఘాతంగా మారింది .


  రాజధాని  అమరావతి నిర్మాణం లో భాగస్వాములవుతున్న కార్మికులు , మేస్త్రీలు , పెయింటర్లు  ఒక్కరేమిటి అన్ని వర్గాల వారు  అన్నా క్యాంటీన్ల ను  మూసివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు . అన్నా క్యాంటీన్ల మూసివేత వల్ల వారు గత  మూడు వారాలుగా అర్ధాకలితో అలమటిస్తున్నారు . అల్పాదాయ , మధ్యతరగతి , కార్మికవర్గం నుంచి వెల్లువెత్తుతోన్న నిరసనను గమనించిన జగన్ సర్కార్ తమ నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: