జగన్ కి మరి కొద్ది రోజుల్లో మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంతకాలం అధికారులు, పాలన, సచివాలయం, క్యాంప్ ఆఫీస్ ఇలా గడిచింది జగన్ జీవితం. ఇక మధ్యలో విదేశీ యాత్రలు కూడా జగన్ చేశారు. సెప్టెంబర్  7 నాటికి జగన్ సర్కార్ వంద రోజుల పండుగ చేసుకోబోతోంది. దాంతో జగన్ కూడా తన పాలనను మరింత దూకుడుగా ముందుకు తీసుకుపోబోతున్నారు.


అది 2009 సెప్టెంబర్ 2. నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ రచ్చబండ కోసం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ లో బయల్దేరారు. ఆయన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సర్వం సిధ్ధం చేశారు. అయితే ఉదయం హైదరాబాద్ లో బయల్దేరిన వైఎస్సార్ హెలికాప్టర్ ఆ తరువాత మరి కనిపించలేదు. అద్రుశ్యమైపోయింది. అలా మబ్బుల్ల్లో నుంచి ఆకాశమార్గం పట్టిన వైఎస్సార్ తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. ఆయన రచ్చబండ ముచ్చట తీరనే లేదు.


ఇపుడు చూస్తే 2019. అంటే సరిగ్గా పదేళ్ళు అవుతోంది సెప్టెంబర్ 2 కి మరో పదిహేను రోజులు ఉంది. జగన్ అదే రోజున రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తన తండ్రి వెళ్ళాలనుకున్న చిత్తూరు రచ్చబండకు జగన్ చేరాలనుకుంటున్నారు. దీనికి పదేళ్ళ సమయం పట్టిందన్నమాట. తండ్రి ఆశయాలనే తన విధానాలుగా మార్చుకున్న జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం ద్వారా ప్రజల్లో తన పాలన పట్ల ఉన్న మంచి చెడ్డలను స్వయంగా బేరీజు వేయనున్నారు.


ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ వాటి ఫలితాలు జనంలో ఏ విధంగా ఉన్నాయో చూసేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారన్నమాట. అది కూడా తన తండ్రి ఎంపిక చేసుకున్న చిత్తూరు జిల్లా నుంచే మొదలుపెట్టడం ద్వారా ఆ సెంటిమెంట్ ని కొనసాగించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరువాత రాష్ట్రమంతటా రచ్చబండ  కార్యక్రమం ఉంటుందని వైసీపీ ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి. మొత్తానికి తండ్రి చేరుకోలేని చోటకు కొడుకు జగన్ వెళ్తున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: