వరదలతో ఉత్తర భారతం ఊగిపోతుంది. పది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో వరద ముంచెత్తుతుంది. వాగులు, వంకలు, నదులు, సెలయేళ్లు పొంగి పొర్లుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వందలాది ఇళ్లు నీట మునుగుతుంటే, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఆస్తి నష్టం అంచనా వేయలేని పరిస్థితి, దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలైతే వానలు వరదలతో గజగజ వణికిపోతున్నాయి. ఉత్తరాది రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వరదలతో వణికిపోతున్నాయి. సిమ్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది.

గత రాత్రి భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర రహదారులతో పాటు నేషనల్ హైవేలు కూడా పూర్తిగా స్తంభించాయి. కిన్నౌర్ లో అయిదో నెంబరు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఉత్తర కాశీలో టోన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరకాశి వరదలకు పదిహెడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఇరవై నాలుగు మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: