తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌరవాన్ని కాపాడ‌టం కోసం ఆవిర్భ‌వించిన టీడీపీ దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌పాటు కాంగ్రెస్‌తో త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా రాజ‌కీయ శ‌క్తుల‌న్నీ ఏకం కావాల‌న్న ల‌క్ష్యంతో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్‌తో చేతులు క‌లిపాడు. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో వ‌చ్చిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితిల‌తో క‌లిసి ప్ర‌జా కూట‌మిగా టీడీపీ పొత్తు చేసింది.


కాంగ్రెస్‌తో టీడీపీ క‌లిసి పోటీ చేయ‌డాన్ని పార్టీలో ఉన్న చాలా మంది నేత‌లు ఇష్ట‌ప‌డ‌క‌పోయినా అధినేత చంద్ర‌బాబు జాతీయ ప్ర‌యోజ‌నాలంటూ స‌ర్దిచెప్ప‌డంతో వారూ స‌ర్దుకుపోక తప్ప‌లేదు. ఆ ఎఫెక్ట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై, టీడీపీపై దారుణంగా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌లకు ముందు తెలంగాణ అసెంబ్లీ ర‌ద్ద‌య్యే నాటికి 15 మంది ఉండాల్సిన టీడీపీకి స‌భ‌లో మిగిలింది ఇద్ద‌రంటే.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే. అయితే ముంద‌స్తు ఎన్నిక‌ల్లో సైతం టీటీడీపీ గెలిచింది కేవ‌లం రెండు స్థానాల్లోనే.వాస్త‌వానికి ప్ర‌తి ఎన్నిక‌లోనూ టీడీపీ పెద్ద‌న్న‌పాత్ర పోషిస్తూ కూట‌మి క‌ట్టేది.


భాగ‌స్వామ్య పార్టీల‌కు సీట్ల‌ను కేటాయించేది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని 72 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 15 స్థానాల్లో గెల‌వ‌గ‌లిగింది. అయితే టీఆర్ఎస్ ఆక‌ర్ష్ మంత్రంతో చివ‌రికి ఇద్ద‌రంటే.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలారు. అప్ప‌ట్లో టీడీపీలో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు 13 మంది అయితే మ‌రికొంత మంది సీనియ‌ర్ నేత‌లు సైతం సైకిల్ దిగి టీఆర్ఎస్‌లో చేరారు. 2017లో పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సైతం త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కాంగ్రెస్‌లో చేరిపోయారు.


అదే స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు సీత‌క్క‌, వేం న‌రేంద‌ర్‌రెడ్డి, జంగ‌య్య యాద‌వ్ వంటి నాయ‌కులు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు.ఇలా ఒక‌రివెంట మ‌రొక‌రు పార్టీ నుంచి వెళ్లిపోవ‌డంతో టీడీపీ ఉనికే ప్ర‌శ్నార్ధ‌కంగా త‌యారైంది. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి ప‌నిచేయ‌డ‌మే కాకుండా పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌తోపాటు ప‌లువురు సీనియ‌ర్‌లు పోటీకి దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌కటించ‌డం పార్టీ నేత‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్ల‌యింది. పైగా పోటీ చేద్దామ‌నుకున్న వారికి టికెట్‌లు ఇప్పించే ప‌రిస్థితి కూడా లేకుండాపోయింది.అదే స‌మ‌యంలో పోటీచేయ‌లేని పార్టీలో ఎలా ఉండ‌గ‌లమంటూ మ‌రికొంద‌రు టీడీపీకి గుడ్‌బై చెప్పారు.  అలా టీడీపీ నుంచి చాలా మంది నాయ‌కులు టీఆర్ఎస్‌లో చేరారు. అక్క‌డ సెటిల్ అయ్యారు కూడా. మిగిలిన నాయ‌కులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. కాషాయ‌కండువాలు క‌ప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, శోభారాణితోపాటు జిల్లాల్లో మిగిలి ఉన్న ముఖ్య నాయ‌కులు బీజేపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


నేరుగా టీడీజీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు లేఖ రాసి తెలంగాణ‌లో పార్టీ మ‌నుగ‌డ లేద‌ని, అందుకే పార్టీని వీడుతున్నామ‌ని ఓపెన్‌గానే చెప్పేశారు. వారిలోని కొంద‌రితో అగ్ర‌నాయ‌క‌త్వం మాట్లాడినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. కేడ‌రే త‌మ బ‌ల‌మంటూ చెప్పుకునే టీడీపీ భ‌విష్య‌త్తు రాజ‌కీయ చ‌ట్రంలో ఏ మ‌లుపు తిర‌గ‌నుందోన‌న్న సెటైర్‌లు సోష‌ల్ మీడియావేద‌క‌గా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: